Chapa ya Youversion
Ikoni ya Utafutaji

జెకర్యా 14

14
యెహోవా వచ్చి పరిపాలిస్తారు
1యెరూషలేమా, యెహోవా దినం రాబోతుంది, అప్పుడు మీ దగ్గర కొల్లగొట్టబడిన ఆస్తులు మీ మధ్యనే పంచుతారు.
2యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు. 3అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలంలో పోరాడే విధంగా ఆ దేశాలతో యుద్ధం చేస్తారు. 4ఆ రోజున ఆయన యెరూషలేముకు తూర్పుగా ఉన్న ఒలీవకొండ మీద తన పాదాలు ఉంచగా ఒలీవకొండ తూర్పు నుండి పడమరకు రెండుగా చీలిపోయి, సగం కొండ ఉత్తరదిక్కుకు, మరో సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగి మధ్యలో విశాలమైన లోయ ఏర్పడుతుంది. 5కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.
6ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు. 7అది యెహోవాకు మాత్రమే తెలిసిన ప్రత్యేకమైన రోజు. అది పగలు కాదు, రాత్రి కాదు. సాయంకాలమైనా వెలుగు ఉంటుంది.
8ఆ రోజున యెరూషలేములో నుండి జీవజలాలు బయలుదేరి వాటిలో సగం మృత సముద్రానికి తూర్పుగా మరో సగం మధ్యధరా సముద్రానికి పడమరగా ప్రవహిస్తాయి. వేసవికాలంలో చలికాలంలో కూడా ఇలాగే ప్రవహిస్తాయి.
9యెహోవా సర్వభూమికి రాజుగా ఉంటారు. ఆ రోజున యెహోవా ఒక్కరే ఉంటారు, ఆయన పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.
10యెరూషలేముకు దక్షిణాన ఉన్న గెబా నుండి రిమ్మోను వరకు ఉన్న దేశమంతా అరాబాలా మైదానంలా అవుతుంది. అయితే యెరూషలేము బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు అనగా మొదటి ద్వారం ఉన్న స్థలం వరకు, హనానేలు గోపురం నుండి రాజ ద్రాక్షగానుగల వరకు వ్యాపించి ఉంటుంది. 11మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది.
12యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి. 13ఆ రోజున యెహోవా ప్రజల్లో గొప్ప భయాన్ని పుట్టిస్తారు. వారంతా శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. 14యూదా వారు కూడా యెరూషలేము దగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూ ఉన్న దేశాల నుండి విస్తారమైన బంగారం, వెండి, వస్త్రాలు, సంపదలు పోగు చేయబడతాయి. 15అలాగే వారి గుర్రాలకు, కంచరగాడిదలకు, ఒంటెలకు, గాడిదలకు శిబిరాలలో ఉన్న పశువులన్నిటికి తెగులు సోకుతుంది.
16అప్పుడు యెరూషలేముపై దాడి చేసిన దేశాలన్నిటిలో మిగిలి ఉన్నవారంతా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి గుడారాల పండుగ ఆచరించడానికి ఏటేటా యెరూషలేముకు వస్తారు. 17ఒకవేళ భూప్రజల కుటుంబాలలో ఎవరైనా రాజైన సైన్యాల యెహోవాను ఆరాధించడానికి యెరూషలేముకు రాకపోతే, వారికి వాన కురవదు. 18ఒకవేళ ఈజిప్టు కుటుంబాలు బయలుదేరి వెళ్లి పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. గుడారాల పండుగ ఆచరించడానికి రాని దేశాలకు యెహోవా నియమించిన తెగులును ఆయన వారికి సోకేలా చేస్తారు. 19ఈజిప్టుకు, గుడారాల పండుగ ఆచరించడానికి వెళ్లని దేశాలకు విధించే శిక్ష ఇదే!
20ఆ రోజున గుర్రాలకు కట్టిన గంటల మీద, “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాయబడి ఉంటుంది. యెహోవా మందిరంలో ఉన్న వంట పాత్రలు బలిపీఠం ఎదుట ఉన్న పవిత్ర పాత్రల వలె ఉంటాయి. 21యెరూషలేములో, యూదాలో ఉన్న ప్రతి పాత్ర సైన్యాల యెహోవాకు ప్రతిష్ఠించబడతాయి, బలి అర్పించడానికి వచ్చే వారంతా ఆ పాత్రల్లో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వంట చేసుకుంటారు. ఆ రోజు ఏ కనానీయుడు#14:21 లేదా వ్యాపారి సైన్యాల యెహోవా మందిరంలో ఉండడు.

Kuonyesha

Shirikisha

Nakili

None

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia