9
జీవితాన్ని సంపూర్ణంగా ఉపయోగించు
1నీతిమంతులు, జ్ఞానులు, వారు చేసే పనులు అన్నీ పరిశీలించి చూసి అవన్నీ దేవుని చేతిలో ఉన్నాయని నేను గ్రహించాను. ప్రేమించడం, ద్వేషించడం అనేవి మనుషుల చేతిలో లేవని, అది వారి వలన కాదనీ నేను తెలుసుకున్నాను.
2జరిగేవి అన్నీ, అందరికీ ఒకే విధంగా జరుగుతాయి.
నీతిమంతులకు, దుష్టులకు,
మంచివారికి, చెడ్డవారికి,
పవిత్రులకు, అపవిత్రులకు,
బలులర్పించే వారికి, అర్పించని వారికి,
అందరికీ ఒకే విధంగా జరుగుతుంది.
మంచివారికెలాగో దుర్మార్గులకూ అలాగే జరుగుతుంది.
ఒట్టు పెట్టుకొనేవాడు ఎలా చనిపోతున్నాడో ఒట్టు పెట్టుకోడానికి భయపడేవాడూ అలాగే చనిపోతున్నాడు.
3అందరికీ ఒకే విధంగా జరగడం అనేది సూర్యుని కింద జరిగే వాటన్నిటిలో బహు దుఃఖకరం. మనుషుల హృదయం చెడుతనంతో నిండిపోయింది. వారు బతికినంత కాలం వారి హృదయంలో మూర్ఖత్వం ఉంటుంది. ఆ తరువాత వారు చనిపోతారు. ఇది కూడా దుఃఖకరం. 4చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.
5బతికి ఉన్న వారికి తాము చనిపోతామని తెలుసు.
అదే చనిపోయిన వారికి ఏమీ తెలియదు.
వారిని అందరూ మరచిపోయారు. వారికి ఇక లాభం ఏమీ లేదు.
6వారి ప్రేమ, పగ, అసూయ అన్నీ గతించి పోయాయి.
సూర్యుని కింద జరిగే వాటిలో ఇక దేనిలోనూ వారి పాత్ర ఉండదు.
7నువ్వు వెళ్లి సంతోషంగా భోజనం చెయ్యి.
సంతోషంతో నీ ద్రాక్షారసం తాగు. దేవుడు కోరేది అదే.
8ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకో. నీ తలకు బాగా నూనె రాసుకో.
9దేవుడు నీకు మంచి జీవితకాలం దయచేశాడు. అది నిష్ప్రయోజనమే అయినా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ జీవితకాలం నిష్ప్రయోజనమే అయినా దానిలో సుఖించు. ఈ జీవితంలో నువ్వు కష్టపడిన దానంతటికీ అదే నీకు కలిగే భాగం. 10నిన్ను చేయమని అడిగిన ఏ పనైనా నీ శక్తి లోపం లేకుండా చేయి. నువ్వు వెళ్ళే సమాధిలో పని గాని, ఉపాయం గాని, తెలివి గాని, జ్ఞానం గాని లేదు.
11నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే,
వేగం గలవారు పరుగులో గెలవరు.
బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు.
తెలివైన వారికి ఆహారం లభించదు.
అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు.
జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు.
ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.
12తమకాలం ఎప్పుడు వస్తుందో మనుషులకు తెలియదు.
చేపలు తమకు మరణకరమైన వలలో చిక్కుకున్నట్టు, పిట్టలు వలలో పట్టుబడినట్టు,
హఠాత్తుగా ఏదో ఒక చెడ్డ సమయం తమ మీదికి వచ్చినప్పుడు వారు చిక్కుకుంటారు.
జ్ఞాని, బుద్ధిహీనుడు
13ఇంకా జరుగుతున్న దాన్ని చూసినప్పుడు నేను అది జ్ఞానం అనుకున్నాను. అది నా దృష్టికి గొప్పదిగా ఉంది. 14ఏమంటే కొద్దిమంది నివసించే ఒక చిన్న పట్టణం ఉంది. దానిమీదికి ఒక గొప్ప రాజు వచ్చి దాన్ని ముట్టడించి దాని ఎదురుగా గొప్ప బురుజులు కట్టించాడు. 15అయితే అందులో ఉండే ఒక బీదవాడు తన తెలివితో ఆ పట్టణాన్ని కాపాడాడు. అయినా ఎవరూ అతణ్ణి జ్ఞాపకం ఉంచుకోలేదు.
16కాబట్టి నేనిలా అనుకున్నాను “బలం కంటే తెలివి శ్రేష్ఠమేగాని బీదవారి తెలివిని, వారి మాటలను ఎవరూ లెక్కచేయరు.”
17మూర్ఖులను పాలించేవాడి కేకలకంటే మెల్లగా వినిపించే జ్ఞానుల మాటలు మంచివి.
18యుద్ధాయుధాల కంటే తెలివి మంచిది.
ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు.