హెబ్రీ పత్రిక 9
9
పాత నిబంధన నియమాలు, మందిరం కేవలం సాదృశ్యరూపాలే
1మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి. 2ఇది ఎలాగంటే, ప్రత్యక్ష గుడారంలో ఒక గదిని సిద్ధం చేశారు. ఇది వెలుపలి గది. దీనిలో ఒక బల్ల, సన్నిధిలో ఉంచే రొట్టెలు ఉంచారు. దీనినే పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
3ఇక రెండవ తెర వెనుక మరో గది ఉంది. దీన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు. 4అందులో బంగారంతో చేసిన సాంబ్రాణి పళ్ళెం ఉంది. ఇక్కడ ఇంకా, బంగారం తొడుగు ఉన్న నిబంధన మందసం కూడా ఉంది. ఆ పెట్టెలో ఒక బంగారు పాత్ర, ఆ పాత్రలో మన్నా ఉంది. ఇంకా ఆ పెట్టెలో చిగిరించిన అహరోను కర్ర, నిబంధనకు సంబంధించిన రెండు రాతి పలకలు ఉన్నాయి.
5“కరుణా పీఠం” అని పిలిచే మందసం మూతను కప్పుతూ తేజస్సుతో నిండిన కెరూబుల ఆకృతులున్నాయి. వాటిని గూర్చి ఇప్పుడు వివరించడం సాధ్యం కాదు. 6వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు.
7కానీ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలి రెండవ గదిలో ప్రవేశిస్తాడు. అయితే అలా ప్రవేశించడానికి ముందు తానూ, తన ప్రజలూ తెలియక చేసిన దోషాల కోసం బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకోకుండా ప్రవేశించడు. 8దీన్ని బట్టి, ఆ మొదటి మందిరం నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం వెల్లడి కాలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు.
9ఆ గుడారం, ఈ కాలానికి ఒక ఉదాహరణగా ఉంది. ఈ అర్పణలూ కానుకలూ ఆరాధించే వ్యక్తి మనస్సాక్షిని పరిపూర్ణం చేయలేక పోయాయి. 10ఇవి కేవలం అన్నపానాలకు, పలురకాల ప్రక్షాళనలకు సంబంధించిన ఆచారాలు. ఇవి నూతన వ్యవస్థ వచ్చేంత వరకూ నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు.
కొత్త నిబంధన మందిరం, బలులు, వాస్తవాలు
11అయితే క్రీస్తు రాబోయే మంచి విషయాలకు ప్రధాన యాజకుడిగా వచ్చాడు. చేతులతో చేయనిదీ, సృష్టి అయిన ప్రపంచానికి చెందనిదీ, పాత గుడారం కంటే మరింత ఘనమైనదీ, మరింత పరిపూర్ణమైనదీ అయిన గుడారం గుండా వచ్చాడు. 12మేకల, కోడె దూడల రక్తంతో కాకుండా క్రీస్తు తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. తద్వారా శాశ్వతమైన రక్షణ కలిగించాడు.
13ఎందుకంటే కేవలం ఎద్దుల రక్తమూ, మేకల రక్తమూ, ఆవు దూడ బూడిదను చల్లడం ఆచారపరంగా అశుద్ధమైన శరీర విషయంలో పవిత్రపరిస్తే 14ఇక నిత్యమైన ఆత్మ ద్వారా ఎలాంటి కళంకం లేకుండా దేవునికి తనను తాను సమర్పించుకున్న క్రీస్తు రక్తం, సజీవుడైన దేవునికి సేవ చేయడానికి నిర్జీవమైన పనుల నుండి మన మనస్సాక్షిని ఎంతగా శుద్ధి చేయగలదో ఆలోచించండి!
15ఈ కారణం చేత ఈ కొత్త ఒప్పందానికి క్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇలా ఎందుకంటే, మొదటి ఒప్పందం కింద ఉన్న ప్రజలను వారు చేసిన పాపాలకు కలిగే శిక్ష నుండి విడిపించడానికి ఒకరు చనిపోయారు. కాబట్టి దేవుడు పిలిచిన వారు ఆయన వాగ్దానం చేసిన తమ శాశ్వతమైన వారసత్వాన్ని స్వీకరించడానికి వీలు కలిగింది.
16ఎవరైనా వీలునామా వదిలి వెళ్తే, ఆ వ్యక్తి మరణించాడని నిరూపణ కావాలి. 17మరణం ఉంటేనే వీలునామా చెల్లుబాటు అవుతుంది. దాన్ని రాసిన వాడు బతికి ఉండగా ఆ వీలునామా చెల్లదు. 18కాబట్టి మొదటి ఒప్పందం కూడా రక్తం లేకుండా ఏర్పడలేదు.
కొత్త నిబంధన క్రీస్తు అంతిమ వీలునామా, ఆయన రక్తంతో ముద్ర వేసినది
19మోషే కూడా ధర్మశాస్త్రంలోని అన్ని ఆదేశాలనూ ప్రజలకు వివరించిన తరువాత కోడెదూడల, మేకల రక్తాన్ని నీళ్ళతో కలిపి ఎర్రని ఉన్ని, హిస్సోపుతో దాన్ని తీసుకుని ధర్మశాస్త్రగ్రంథం చుట్ట మీదా, ప్రజలందరి మీదా చిలకరించాడు. 20తరువాత, “ఇది నిబంధన రక్తం. దీనిలోనే దేవుడు మీకు ఆదేశాలు ఇచ్చాడు” అని చెప్పాడు. 21అలాగే ఆ రక్తాన్ని, ఆరాధనా గుడారం పైనా, గుడారంలోని యాజక సేవకు ఉపయోగించే పాత్రలన్నిటిపైనా చిలకరించాడు. 22ధర్మశాస్త్రం ప్రకారం, దాదాపు వస్తువులన్నీ రక్తం వల్ల శుద్ధి అవుతాయి. రక్తం చిందించకపోతే పాపాలకు క్షమాపణ కలగదు.
పరలోక మందిరం మరింత శ్రేష్ఠమైన బలిద్వారా శుద్ధి అయింది
23కాబట్టి పరలోకంలో ఉన్నవాటికి నకలుగా ఉన్న వస్తువులు జంతు బలుల వల్ల శుద్ధి కావలసి ఉంది. అయితే అసలు పరలోకానికి సంబంధించినవి శుద్ధి కావాలంటే అంతకంటే శ్రేష్ఠమైన బలులు జరగాలి. 24అందుచేత చేతులతో నిర్మాణం జరిగి, నిజమైన దానికి నకలుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి క్రీస్తు ప్రవేశించలేదు, ప్రస్తుతం ఆయన మనందరి కోసమూ దేవుని సన్నిధిలో కనిపించడానికి ఏకంగా పరలోకంలోకే ప్రవేశించాడు.
కొత్త నిబంధనలోని ఒకే బలి పాత నిబంధనలోని అనేక బలులకన్నా శ్రేష్ఠమైనది
25అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని వేరే రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అయితే యేసు పదే పదే తనను తాను అర్పించుకోడానికి అక్కడికి వెళ్ళలేదు. 26ఒకవేళ ఆయన పదేపదే అక్కడికి వెళ్ళాల్సి వస్తే భూమి ప్రారంభం నుండి ఆయన అనేకసార్లు హింస పొందాల్సి వచ్చేది. కానీ ఆయన ఈ కాలాంతంలో ప్రత్యక్షమై ఒకేసారి తనను తాను బలిగా అర్పించడం ద్వారా పాపాన్ని తీసివేశాడు.
27మనుషులంతా ఒకేసారి చనిపోతారు. తరువాత తీర్పు జరుగుతుంది. 28అలాగే క్రీస్తు అనేకమంది పాపాలను తీసివేయడం కోసం ఒక్కసారే తనను తాను అర్పించుకున్నాడు. ఆయన రెండోసారి కనిపించనున్నాడు. అయితే ఈ సారి పాపాల కోసం కాదు కానీ తన కోసం సహనంతో వేచి ఉన్నవారి రక్షణ కోసం కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
హెబ్రీ పత్రిక 9: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.