యిర్మీయా 9
9
1నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక.
ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.
2నా ప్రజలంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపులాగా ఉన్నారు.
నేను వారిని విడిచిపెట్టి వెళ్లి ఉండడానికి అరణ్యంలో ఒక బాటసారుల నివాసం నాకు దొరికితే బాగుండును.
3విల్లును వంచినట్టుగా వారు తమ నాలుకను అబద్ధమాడడానికి వంచుతారు. ఈ భూమిపై వారు నమ్మదగిన వారు కాదు. వారు ఒకటి తరవాత మరొకటి చెడుకార్యాలు జరిగిస్తున్నారు. “నేను ఎవరో వారు ఎరుగరు” అని యెహోవా చెబుతున్నాడు.
4మీలో ప్రతివాడూ తన పొరుగువాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏ సోదరుణ్నీ నమ్మవద్దు. ఎందుకంటే నిజంగా ప్రతి సోదరుడూ మోసం చేసేవాడే.
ప్రతి పొరుగువాడూ అపనిందలు వేస్తూ తిరుగుతుంటాడు.
5ప్రతివాడూ సత్యం చెప్పకుండా తన పొరుగువాడిని మోసం చేస్తాడు. అక్రమం జరిగించడం వారికి అలవాటై పోయింది. ఎంతసేపూ ఎదుటి వారిలో తప్పులు పట్టాలని చూస్తారు.
6కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
7కాబట్టి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే, చూడూ, నేను వారిని లోహం లాగా కరిగించి పరీక్షించబోతున్నాను. వారికి ఇంతకంటే మరేమి చెయ్యను?
8వారి నాలుక పదును పెట్టిన బాణం, అది కపటమే పలుకుతుంది.
ఒకడు తన పొరుగువారితో పైకి స్నేహపూర్వకంగా మాట్లాడతాడు గాని మనస్సులో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు ఉంటాయి.
9ఈ సంగతులు తెలిసీ నేను వారిని శిక్షించకూడదా?
ఈ దేశాన్ని దండించ కూడదా? ఇదే యెహోవా వాక్కు.
10పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను.
ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు.
ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.
11యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను.
యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.
12ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు?
ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
13యెహోవా చెప్పేదేమంటే, “దానికి కారణం, వారు నా మాట వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా తోసిపుచ్చారు. 14తమ హృదయంలోని మూర్ఖత్వం ప్రకారం చేశారు. తమ పూర్వికుల దగ్గర నేర్చుకున్నట్టు బయలు దేవుళ్ళను పూజించారు. అందుకే వారి దేశం పాడైపోయింది.”
15సైన్యాల ప్రభువు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పేదేమంటే, “నేను ఈ ప్రజలు చేదుకూరలు తినేలా చేస్తాను. విషజలం తాగిస్తాను. 16వారు గానీ, వారి పూర్వికులు గానీ ఎరగని జాతి ప్రజల్లోకి వారిని చెదరగొడతాను. వారు పూర్తిగా నాశనం అయ్యేవరకూ వారి పైకి ఖడ్గం పంపుతాను.”
17సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి.
విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి.
18మనం కన్నీళ్లు విడిచేలా, మన కనురెప్పల నుండి నీళ్లు కారిపోయేలా వారు త్వరగా వచ్చి రోదన ధ్వని చేయమని చెప్పండి.”
19“మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు.
మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది” అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.
20స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి.
మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి.
21మరణం మన ఇంటి కిటికీల గుండా ఎక్కుతూ ఉంది. మన రాజభవనాల్లో అడుగు పెడుతూ ఉంది.
అది వీధుల్లో పసిపిల్లలు, రాజమార్గాల్లో యువకులు లేకుండా వారిని నాశనం చేస్తున్నది.
22యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి.
వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”
23యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.
24దేనిలో అతిశయించాలంటే, ఈ భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడంలోనే అతిశయించాలి.
అలాటి వాటిలోనే నేను ఆనందిస్తాను.”
25యెహోవా చెప్పేదేమంటే “అన్యజాతి ప్రజలు సున్నతి పొందలేదు. ఇశ్రాయేలీయులేమో హృదయ సంబంధమైన సున్నతి పొందలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో సున్నతి పొందని వారినీ, పొందిన వారినీ కలిపి శిక్షిస్తాను. 26అంటే ఐగుప్తు వారు, యూదులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఎడారిలో నివసిస్తూ తమ గడ్డాలు చెంపలపై గొరిగించుకునేవారు, వీరందరినీ నేను శిక్షిస్తాను.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 9: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.