యోబు 1

1
యోబు, అతని నేపధ్యం
1ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవునిపట్ల భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు. 2అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. 3అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు.
4అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్ళలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు. 5వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు.
సాతానుకు దేవునికి మధ్య సంభాషణ
6ఒకరోజున దేవదూతలు#1:6 దేవదూతలు దేవుని కుమారులు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. 7యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. 8అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు.
9అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు. 12అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.
13ఒక రోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. 14అతడు వాళ్ళతో “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు. 15పనివాళ్ళను కత్తులతో చంపివేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను” అని చెప్పాడు.
16ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. “దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు. 17అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
18అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. 19అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు.
20అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21“నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.”
22జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 1: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి