యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు ప్రయాణమై సాగిపోయాడు. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. “మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు. ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు. దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు. తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు. ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. “ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. ఆయన యెరూషలేము పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని చూస్తూ దాని విషయం విలపించాడు. “నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు. ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు. నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు. అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు. ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజల్లో ముఖ్యులు ఆయనను అంతం చేయాలని చూస్తూ వచ్చారు. కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.
Read లూకా 19
వినండి లూకా 19
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: లూకా 19:28-48
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు