కీర్తన 59
59
ప్రధాన సంగీతకారుని కోసం. అల్ తశ్హేత్ అనే రాగంతో పాడేది. సౌలు పంపిన మనుషులు ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు దావీదు రాసిన మిఖ్తీమ్ (రసిక కావ్యం).
1నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు.
2పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
3నా ప్రాణం తీయడానికి వారు కాపుకాశారు. యెహోవా, నేను దోషం చేసినందుకో, పాపం చేసినందుకో కాదు.
4నాలో ఏ అక్రమం లేకపోయినా వారు నా మీదికి పరిగెత్తి రావడానికి సిద్ధపడ్డారు. లేచి నాకు సహాయం చెయ్యి.
5సేనల ప్రభువైన యెహోవా, ఇశ్రాయేలు దేవా, అన్యజాతులను శిక్షించడానికి మేలుకో. ఆ దుర్మార్గుల్లో ఎవరినీ కనికరించవద్దు.
6సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
7మన మాటలు ఎవరు వింటారులే అనుకుని వారు తమ నోటితో మాటలు వెళ్లగక్కుతారు. వారి పెదాల్లో కత్తులున్నాయి.
8అయితే యెహోవా, నువ్వు వాళ్ళను చూసి నవ్వుతావు. అన్యజాతులను నువ్వు ఎగతాళి చేస్తావు.
9దేవా, నా బలమా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నా ఎత్తయిన బురుజు నువ్వే.
10నా దేవుడు తన నిబంధన నమ్మకత్వంలో నన్ను కలుసుకుంటాడు. నా శత్రువులకు జరిగిన దాన్ని దేవుడు నాకు చూపిస్తాడు.
11వారిని చంపొద్దు. ఎందుకంటే నా ప్రజలు దాన్ని మరచిపోతారేమో. మా ధ్వజం లాంటి నువ్వు నీ బలంతో వారిని చెల్లాచెదరు చేసి అణగ గొట్టు.
12వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపాన్ని బట్టి, వారు పలికిన శాపాలను బట్టి, అబద్ధాలను బట్టి వారు తమ గర్వంలో చిక్కుకునేలా చెయ్యి.
13వారు ఇకపై కనబడకుండా పోయేలా కోపంతో వారిని నిర్మూలించు. దేవుడు యాకోబు#59:13 యాకోబు ఇశ్రాయేలు సంతానాన్ని ఏలుతున్నాడని భూదిగంతాల వరకూ మనుషులు తెలుసుకునేలా చెయ్యి.
14సాయంకాలం వారు మళ్ళీ వస్తారు. కుక్కల్లాగా మొరుగుతూ పట్టణం చుట్టూ తిరుగుతారు.
15తిండికోసం అటూ ఇటూ తిరుగుతారు. ఇంకా తృప్తి కలగకపోతే రాత్రి అంతా కనిపెడతారు.
16నీవు నాకు ఎత్తయిన బురుజుగా ఉన్నావు. ఆపద రోజున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలాన్ని గూర్చి నేను కీర్తిస్తాను. ఉదయాన నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను.
17దేవుడు నాకు ఎత్తయిన కోటగా, నిబంధనా దేవుడుగా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను కీర్తిస్తాను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
కీర్తన 59: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.