తీతు పత్రిక 3

3
యోగ్యమైన కాపరి పరిచర్య
1పరిపాలకులకూ, అధికారులకూ లోబడి ఉండాలనీ ప్రతి మంచి పనీ చేయడానికి సిద్ధంగా ఉండాలనీ వారికి గుర్తు చెయ్యి. 2వారు ఎవరినీ దూషించకుండా, వాదనలు పెట్టుకోకుండా, ప్రశాంతంగా మనుషులందరి పట్లా సంపూర్ణమైన మర్యాద కలిగి జీవించాలి. 3ఎందుకంటే మనం కూడా గతంలో బుద్ధిహీనులుగా, అవిధేయులుగా ఉన్నాం. అటు ఇటు చెదరిపోయి నానా విధాలైన విషయ వాంఛలకు బానిసలుగా దుష్టత్వంలో, అసూయతో జీవిస్తూ, అసహ్యులుగా ద్వేషానికి గురి అవుతూ ద్వేషిస్తూ ఉండేవాళ్ళం.
4అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు 5మన నీతిక్రియల మూలంగా కాక, తన కనికరం మూలంగా నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగించడం ద్వారా దేవుడు మనలను రక్షించాడు. 6-7దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.
8ఈ మాట నమ్మదగింది కాబట్టి దేవునిలో విశ్వసించేవారు తమ ఎదుట ఉంచబడిన మంచి పనులు శ్రద్ధగా చేయడంలో మనసు లగ్నం చేయమని నీవు ఈ సంగతులను గూర్చి గట్టిగా చెప్పాలని నేను కోరుతున్నాను. ఇవి మంచివి, మనుషులకు ప్రయోజనకరమైనవి.
9అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు. 10మీలో విభేదాలు కలిగించే వారిని ఒకటి రెండుసార్లు హెచ్చరించిన తరువాత వారితో తెగతెంపులు చేసుకో. 11నీకు తెలుసు, అలాటివాడు దారి తప్పిపోయి పాపం చేసి తనకు తానే శిక్ష విధించుకుంటున్నాడు.
12నేను నికొపొలిలో చలికాలం గడపాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపినప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి. 13న్యాయవాది జేనానూ అపొల్లోనూ త్వరగా పంపించు. వారికేమీ తక్కువ కాకుండా చూడు.
14మన వారు నిష్ఫలులు కాకుండా, ముఖ్య అవసరాలను సమకూర్చుకోగలిగేలా మంచి పనులు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. 15నాతో ఉన్నవారంతా నీకు అభివందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారికి మా అభివందనాలు చెప్పు.
కృప మీ అందరికీ తోడై ఉండుగాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

తీతు పత్రిక 3: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి