1 సమూయేలు 27

27
దావీదు తన మనుష్యులతో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్లుట
1తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
2అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు. 3దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలు నివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు. 4దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.
5ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.
6సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది. 7ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
దావీదు ఆకీషు రాజును మోసగించుట
8దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు. 9ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.
10దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు. 11బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.”
ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు. 12ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 27: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి