నిర్గమకాండము 13

13
1అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. 2“ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”
3మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. 4అబీబు#13:4 అబీబు లేక వసంతకాలం ప్రాచీన యూదా సంవత్సరంలో యిది మొదటి నెల నిసాన్ (మార్చి, ఏప్రిల్). మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. 5మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.
6“ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. 7కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. 8‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”
9“మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది. 10కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.
11“మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత 12ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి. 13తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.
14“మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు. 15ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ#13:15 మగపిల్లను లేక “పిల్లలు.” నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’ 16ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది.#13:16 కట్టబడ్డ … బాసికంలాంటిది యూదులు వారి దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొనేందుకు సూచనగా చేతులమీద, నొసటమీద ఇలాంటివి కట్టుకొంటారని సూచన కావచ్చును. యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”
ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం
17ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” 18కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.
యోసేపు ఎముకలు స్వదేశానికి తీసుకొని వెళ్లడం
19మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.
యెహోవా తన ప్రజలను నడిపించాడు
20ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 21యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది. 22పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నిర్గమకాండము 13: TERV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి