యోబు 19
19
యోబు జవాబు
1అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు:
2“ఎంతకాలం మీరు నన్ను బాధిస్తారు;
మాటలతో నన్ను నలుగగొడతారు?
3ఇప్పటికి మీరు నన్ను పదిసార్లు అవమానించారు.
మీరు నా మీద దాడి చేసేటప్పడు ఎలాంటి సిగ్గూ ఉండదు మీకు.
4ఒకవేళ నేను పాపం చేసినా,
అది నా సమస్య అది మిమ్మల్ని బాధించదు.
5మీరు కేవలం నా కంటే మంచివాళ్లలా చూపించుకోవాలని కోరుతున్నారు.
నా కష్టాలకు కారణం నా తప్పు మాత్రమే అని మీరు అంటారు.
6కానీ నాకు అపకారం చేసినవాడు దేవుడు.
ఆయన నన్ను పట్టుకోవటానికి తన వలను నా చుట్టూరా వేశాడు.
7‘నాకు అపకారం జరిగింది.’ అని నేను కేకలు వేస్తాను.
నాకు జవాబు ఏమీ రాదు. సహాయం కోసం నేను గట్టిగా కేకలు వేసినా న్యాయం కోసమైనా నా మొర ఎవరూ వినరు.
8నేను ముందుకు వెళ్లలేకుండా దేవుడు నా మార్గం మూసివేశాడు.
నా త్రోవను ఆయన చీకట్లో దాచి పెట్టేశాడు.
9నా ఐశ్వర్యాన్ని దేవుడు తీసివేసుకొన్నాడు.
నా తలమీద కిరీటాన్ని ఆయన తీసివేసుకొన్నాడు.
10నేను చచ్చేంతవరకు నన్ను ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కవరకు దేవుడు విరుగగొడతాడు.
ఒక చెట్టుదాని వేళ్లతో సహా పెల్లగించబడ్డట్టు ఆయన నా ఆశ తీసివేస్తాడు
11దేవుని కోపం నాకు వ్యతిరేకంగా మండుతుంది.
ఆయన నన్ను తన శత్రువు అని పిలుస్తున్నాడు.
12నా మీద దాడి చేసేందుకు దేవుడు తన సైన్యాన్ని పంపుతాడు.
వారు నా చుట్టూరా దుర్గాలు నిర్మిస్తారు.
నా గుడారం చుట్టూరా వారు బసచేస్తారు.
13“నా సోదరులు నన్ను ద్వేషించేటట్టు దేవుడు చేశాడు.
నా స్నేహితులందరికీ నేను పరాయివాడను.
14నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు.
నా స్నేహితులు నన్ను మరచిపోయారు.
15నా ఇంట్లో అతిధులు, పనికత్తెలు
నేనేదో పరాయివాడిలా, విదేశీయునిలా నన్ను చూస్తారు.
16నేను నా సేవకుని పిలిస్తే వాడు జవాబివ్వడు.
సహాయం కోసం నేను బతిమలాడినా నా సేవకుడు జవాబు ఇవ్వడు.
17నా శ్వాస వాసన అంటే నా బార్యకు అసహ్యం.
నా స్వంత సోదరులు నన్ను ద్వేషిస్తారు.
18చిన్న పిల్లలు కూడా నన్ను గేళి చేస్తారు.
నేను వాళ్ల దగ్గరకు వస్తే వాళ్లు నాకు విరోధంగా చెడు సంగతులు మాట్లాడుతారు.
19నాకు సన్నిహితమైన స్నేహితులు అందరూ నన్ను అనహ్యించుకొంటారు.
చివరికి నేను ప్రేమించే మనుష్యులు కూడా నాకు విరోధులయ్యారు.
20“నేను ఎంత సన్నగా ఉన్నానంటే నా ఎముకల మీద నా చర్మం వ్రేలాడుతూ ఉంది.
నాలో నాకు కొద్దిపాటి ప్రాణం మాత్రమే మిగిలి ఉంది.
21“నాపై దయ చూపండి, నా స్నేహితులారా, నాపై దయ చూపండి.
దేవుని హస్తం నాకు విరోధంగావుంది.
22దేవుడు చేసినట్టు, మీరు ఎందుకు నన్ను హింసిస్తారు?
నన్ను బాధించి మీరెందుకు ఎన్నడూ తృప్తి చెందటం లేదు?
23“నేను (యోబు) చెప్పేది ఎవరో ఒకరు జ్ఞాపకం ఉంచుకొని, ఒక గ్రంథంలో వ్రాస్తే బాగుంటుందని నా ఆశ.
నేను చెప్పే మాటలు ఒక గ్రంథపు చుట్టలో వ్రాయబడాలని నా ఆశ.
24నేను చెప్పే మాటలు శాశ్వతంగా ఉండేటట్టు సీసంమీద ఇనుప పోగరతో చెక్కబడాలని
లేదా ఒక బండమీద వ్రాయబడాలని నా ఆశ.
25నన్ను ఆదుకొనేవారు ఎవరో ఒకరు ఉన్నారని నాకు తెలుసు.
అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు.
26నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా చర్మం పాడైపోయిన తర్వాత కూడా
నేను దేవుణ్ణి చూస్తానని నాకు తెలుసు.
27నా స్వంత కళ్లతో నేను దేవుణ్ణి చూస్తాను.
సాక్షాత్తూ దేవుణ్ణే, ఇంకెవరినీ కాదు.
నాలో నా హృదయం బలహీనం అవుతోంది.
28“ఒకవేళ మీరు, ‘మనం యోబును ఇబ్బంది పెడ్దాం,
అతణ్ణి నిందించటానికి ఏదైనా కారణం వెదుకుదాం’ అనుకొవచ్చును.
29కానీ మీ మట్టుకు మీరే ఖడ్గానికి భయపడాలి. ఎందుకంటే, పాపంమీద దేవుని కోపం శిక్షను రప్పిస్తుంది.
మిమ్మల్ని శిక్షించేందుకు యెహోవా ఖడ్గం ప్రయోగిస్తాడు.
అప్పుడు తీర్పు ఉంది అని మీరు తెలుసుకొంటారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 19: TERV
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International