లూకా 19:28-48

లూకా 19:28-48 TERV

యేసు ఈ ఉపమానం చెప్పి యెరూషలేము వైపు ప్రయాణం సాగించాడు. వాళ్ళు ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ గ్రామాలను చేరుకొన్నాక యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరా గ్రామాన్ని ప్రవేశించగానే స్థంభానికి కట్టబడిన ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద యిదివరకు ఎవ్వరూ ఎక్కలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. ఎవరైనా ‘ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ఇది ప్రభువుకు కావాలని చెప్పండి” అని అన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పిన విధంగా గాడిద స్థంభానికి కట్టబడి ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా దాని యజమానులు వచ్చి, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. ఇది “ప్రభువుకు కావాలి” అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్ళు దాన్ని యేసు దగ్గరకు తీసుకు వచ్చి తమ వస్త్రాల్ని దానిపై పరిచి, దాని మీద యేసును ఎక్కించారు. ఆయన వెళ్తుండగా, ప్రజలు తమ వస్త్రాల్ని దారి మీద పరిచారు. ఆయన ఒలీవల కొండమీద నుండి క్రిందికి దిగే స్థలాన్ని చేరుకున్నాడు. శిష్యుల గుంపంతా తాము మహత్యాలు చూసినందుకు ఆనందంతో బిగ్గరగా యిలా దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు: “‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’ పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!” గుంపులో ఉన్న కొందరు పరిసయ్యులు యేసుతో, “బోధకుడా! మీ శిష్యుల్ని అదుపులో పెట్టుకో!” అని అన్నారు. యేసు, “వాళ్ళు గొంతెత్తి మాట్లాడటం ఆపితే, రాళ్ళు గొంతెత్తి మాట్లాడటం మొదలు పెడతాయి” అని సమాధానం చెప్పాడు. ఆయన యెరూషలేము సమీపిస్తూ ఆ పట్టణాన్ని చూసి ఈ విధంగా విలపించ సాగాడు: “శాంతిని స్థాపించటానికి ఏమి కావాలో నీకు ఈ రోజైనా తెలిసుంటే బాగుండేది. కాని అది నీకిప్పుడు అర్థం కాదు. నీ శత్రువులు నీ చుట్టూ గోడకట్టి నాలుగు వైపులనుండి ముట్టడి చేసే రోజులు రానున్నాయి. వాళ్ళు నిన్ను, నీ ప్రజల్ని నేల మట్టం చేస్తారు. దేవుని రాకను నీవు గమనించలేదు. కనుక వాళ్ళు ఒక రాయి మీద యింకొక రాయి ఉండకుండా చేస్తారు.” ఆ తర్వాత ఆయన మందిరంలోకి ప్రవేశించి అక్కడ అమ్ముతున్న వ్యాపారస్తుల్ని తరిమి వేయటం మొదలు పెట్టాడు. వాళ్ళతో, “నా ఆలయం ప్రార్థనా ఆలయం. కాని మీరు దాన్ని ‘దొంగలు దాగుకొనే స్థలంగా’ మార్చారు!” అని చెప్పబడిందని అన్నాడు. ఆయన ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజా నాయకులు ఆయన్ని చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కాని ప్రజలు యేసు మాటలు శ్రద్ధతో వింటూ ఉండటంవల్ల ఆయన్ని ఏ విధంగా చంపాలో వాళ్ళకు బోధపడలేదు.