యోబు 30
30
1“అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు,
నాకన్నా చిన్నవారు,
ఎవరి తండ్రులను నేను
నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.
2వారి చేతుల బలం వల్ల నాకేమి ఉపయోగం?
వారు బలం నశించిపోయిన పురుషులు.
3లేమితో ఆకలితో బక్కచిక్కినవారై,
పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు
రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.
4ఆకుల పొదల్లో ఉప్పు మూలికలు సేకరించారు,
బదరీ వేర్లు వారికి ఆహారము.
5వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు,
వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు.
6కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో,
బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.
7వారు పొదల మధ్య విరుచుకుపడ్డారు
ముండ్లకంపల క్రింద ఒక్కటిగా పోగయ్యారు.
8పేరు లేని బుద్ధిహీనుల కుమారులు
వారు దేశం నుండి తరిమివేయబడ్డారు.
9“అలాంటి వారికి నేను హేళన పాట అయ్యాను;
వారికి నేను ఓ సామెతను అయ్యాను.
10వారు నన్ను చూసి అసహ్యించుకుని దూరంగా జరుగుతున్నారు;
నా ముఖం మీద ఉమ్మివేయడానికి కూడా వెనుకాడరు.
11దేవుడు నా విల్లును విప్పి నన్ను బాధపెట్టారు,
వారు నా సమక్షంలో సంయమనాన్ని వదిలేశారు.
12నా కుడి వైపున తెగ దాడులు;
వారు నా పాదాలకు వలలు వేస్తారు,
నాకు వ్యతిరేకంగా తమ నాశన ప్రయత్నాలను చేస్తున్నారు.
13నా మార్గాన్ని పాడుచేస్తున్నారు;
నన్ను నాశనం చేయడంలో వారు విజయం సాధించారు.
వారిని అడ్డుకునేవారు లేరు.
14గండిపడిన పెద్ద ప్రవాహంవలె వారు వస్తారు;
పతనంలా వారు దొర్లుతూ వస్తారు.
15భయాలు నన్ను ముంచెత్తుతాయి;
నా గౌరవం గాలిలా తరిమివేయబడింది,
నా భద్రత మేఘంలా అదృశ్యమవుతుంది.
16“ఇప్పుడు నా జీవితం దూరమవుతుంది;
శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాయి.
17రాత్రి నా ఎముకలను పొడుస్తూ ఉంది;
నన్ను కొరికివేస్తున్న నొప్పి ఆగడమే లేదు.
18తన గొప్ప శక్తితో దేవుడు నాకు దుస్తుల్లా#30:18 కొ.ప్రా.లలో నా దుస్తులతో నన్ను పట్టుకుంటారు అవుతాడు;
నా చొక్కా మెడవలె ఆయన నన్ను బంధిస్తారు.
19ఆయన నన్ను బురదలో పడవేశారు,
నేను దుమ్ము బూడిదగా అయ్యాను.
20“దేవా, నేను మీకు మొరపెడతాను, కాని మీరు జవాబు ఇవ్వరు;
నేను నిలబడతాను అయినా మీరు నన్ను ఊర్కెనే చూస్తారు.
21నా పట్ల మీరు కఠినంగా మారారు;
మీ బాహువు బలం చేత నా మీద దాడి చేస్తావు.
22నీవు నన్ను లాక్కుని గాలి ముందు నడిపిస్తావు;
నీవు తుఫానులో నన్ను విసిరివేస్తావు.
23సజీవులందరి కోసం నియమించబడిన స్థలమైన,
మరణానికి నీవు నన్ను రప్పిస్తావని నాకు తెలుసు.
24“విరిగిన వ్యక్తి తన బాధలో సహాయం కోసం
కేకలు వేసినప్పుడు ఖచ్చితంగా ఎవరూ చేయి వేయరు.
25ఇబ్బందుల్లో ఉన్న వారి కోసం నేను ఏడవలేదా?
పేదవారిని చూసి నా ప్రాణం దుఃఖపడలేదా?
26అయినాసరే నేను మేలు జరుగుతుందని ఆశిస్తే, కీడు జరిగింది;
నేను వెలుగు కోసం చూస్తే, చీకటి వచ్చింది.
27నా లోపల చిందరవందర ఎప్పుడూ ఆగదు;
శ్రమ దినాలు నాకెదురయ్యాయి.
28నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు;
నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను.
29నేను నక్కలకు సోదరుడనయ్యాను,
గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.
30నా చర్మం నల్లబడి రాలిపోతుంది;
నా శరీరం జ్వరంతో కాలిపోతుంది.
31నా వీణ దుఃఖానికి,
నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోబు 30: TSA
హైలైట్
షేర్ చేయి
కాపీ

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version, Holy Bible
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.