14
ఒక పరిసయ్యుని ఇంట్లో యేసు
1ఒక సబ్బాతు దినాన, అధికారిగా ఉండిన ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి యేసు వెళ్లినప్పుడు, కొందరు ఆయన ఏమి చేస్తాడా అని ఆయనను గమనిస్తున్నారు. 2అక్కడ ఆయన ముందు విపరీతమైన వాపుతో బాధపడుతున్న ఒక రోగి ఉన్నాడు. 3అప్పుడు యేసు, “సబ్బాతు దినాన స్వస్థపరచడం ధర్మశాస్త్రానుసారమా కాదా?” అని పరిసయ్యులను మరియు ధర్మశాస్త్ర నిపుణులను అడిగారు. 4కానీ వారు ఏ జవాబు ఇవ్వలేదు, అప్పుడు యేసు ఆ రోగి చేయి పట్టుకొని వానిని బాగుచేసి పంపించారు.
5అప్పుడు ఆయన వారితో, “మీలో ఎవరి కుమారుడు గాని లేక ఎద్దు గాని సబ్బాతు దినాన గుంటలో పడితే వెంటనే దానిని బయటకు తీయకుండా ఉంటారా?” అని అడిగారు. 6కాని వారు ఆయనకు జవాబు ఇవ్వలేక పోయారు.
7ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: 8“ఎవరైనా మిమ్మల్ని వివాహ విందుకు ఆహ్వానించినప్పుడు, గౌరవ స్థానాన్ని తీసుకోకండి, ఎందుకంటే మీ కంటే ఎక్కువ ప్రముఖ వ్యక్తి ఆహ్వానించబడి ఉండవచ్చు. 9ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీ స్థానాన్ని వీరికివ్వండి’ అని అంటాడు. అప్పుడు, అవమానంతో, ఎక్కడో చివరి స్థానంలో కూర్చోవలసి వస్తుంది. 10అలా కాకుండ, నీవు ఆహ్వానించబడినప్పుడు, నీవు చివరి స్థానంలో కూర్చో, అప్పుడు నిన్ను ఆహ్వానించినవారు వచ్చినప్పుడు, అతడు నీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న ముఖ్య స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు. 11ఎందుకంటే తనను తాను హెచ్చించుకొనేవారు తగ్గింపబడతారు, తనను తాను తగ్గించుకొనేవారు హెచ్చింపబడతారు” అన్నారు.
12తర్వాత యేసు తనను ఆహ్వానించిన వానితో, “నీవు మధ్యాహ్న భోజనం గానీ రాత్రి భోజనం గానీ పెట్టినప్పుడు, నీ స్నేహితులనే గానీ, సహోదరులు లేక సహోదరీలనే గానీ, బంధువులనే గానీ, ధనికులైన పొరుగువారినే గానీ ఆహ్వానించవద్దు; ఒకవేళ నీవు అలా చేస్తే, వారు కూడా తమ విందులకు నిన్ను ఆహ్వానించి నీ రుణాన్ని తీర్చేసుకుంటారు. 13అయితే నీవు విందును ఏర్పాటు చేసినప్పుడు పేదలను, కుంటివారిని, గ్రుడ్డివారిని, వికలాంగులను ఆహ్వానించు, 14అప్పుడు నీవు దీవించబడతావు. పిలువబడిన వారు నీకు తిరిగి ఏమి ఇవ్వలేకపోయినా, నీతిమంతుల పునరుత్థానంలో నీకు తిరిగి ఇవ్వబడుతుంది” అన్నారు.
గొప్ప విందును గురించిన ఉపమానం
15అది విని వారితో భోజనానికి కూర్చున్నవారిలో ఒకడు విని, యేసుతో, “దేవుని రాజ్య విందులో తినేవాడు ధన్యుడు” అని అన్నాడు.
16అందుకు యేసు, “ఒకడు గొప్ప విందు సిద్ధపరుస్తూ చాలామంది అతిథులను ఆహ్వానించాడు. 17విందు సమయంలో విందుకు పిలువబడినవారిని, ‘రండి, విందు సిద్ధంగా ఉంది’ అని చెప్పడానికి అతడు తన సేవకులను పంపించాడు.
18“కానీ వారందరు ఒకేలా సాకులు చెప్పడం మొదలుపెట్టారు. మొదటి వాడు, ‘నేను ఇప్పుడే ఒక పొలం కొన్నాను కనుక దానిని చూడడానికి తప్పక వెళ్లాలి, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
19“మరొకడు, ‘నేనిప్పుడే ఐదు జతల ఎడ్లను కొన్నాను, ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి’ అన్నాడు.
20“మరొకడు, ‘నేను ఇప్పుడే పెళ్ళి చేసుకొన్నాను, కనుక నేను రాలేనని’ చెప్పి పంపాడు.
21“ఆ సేవకుడు తిరిగి వచ్చి, తన యజమానికి వారి మాటలను తెలియజేసాడు. ఆ యజమాని ఆ మాటలను విని కోపపడి ఆ సేవకునితో, ‘నీవు వెంటనే వెళ్లి పట్టణ వీధుల్లో, సందుల్లో ఉన్న బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని తీసుకురా’ అని ఆదేశించాడు.
22“ఆ సేవకుడు తన యజమానితో, ‘అయ్యా, నీవు చెప్పినట్లే చేశాను, అయినా ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది’ అన్నాడు.
23“అందుకు ఆ యజమాని తన సేవకునితో, ‘నా ఇంటిని నింపడానికి వీధుల్లో సందులలోన కనిపించిన వారందరిని లోపలికి రమ్మని బలవంతం చెయ్యి. 24ఆహ్వానించబడిన వారిలో ఒక్కడు కూడ నేను ఏర్పచిన విందును రుచి చూడడని మీతో చెప్తున్నాను’ అని అన్నారు.”
శిష్యునిగా ఉండడానికి మూల్యం
25పెద్ద జనసమూహాలు యేసుతో కూడా వెళ్తుండగా, ఆయన వారివైపు తిరిగి అన్నారు: 26“ఎవరైనా, నా శిష్యునిగా ఉండాలనుకుంటే తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, సహోదర సహోదరీలను, చివరికి తన ప్రాణాన్ని సైతం, వదులుకోడానికి సిద్ధంగా లేకపోతే, నా శిష్యులు కాలేరు. 27తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు శిష్యులు కాలేరు.
28“ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటున్నారనుకోండి. దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా అంచనా వేసుకోరా? 29ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతీ ఒక్కరు మిమ్మల్ని, 30‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేక పోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.
31“ఒక రాజు మరొక రాజుపై యుద్ధం చేయబోయేటప్పుడు, ఇరవైవేలమంది సైన్యంతో తన మీదికి వస్తున్న వాన్ని పదివేలమంది సైన్యంతో ఎదుర్కోగలనా అని అతడు ముందుగానే కూర్చుని ఆలోచించడా? 32ఒకవేళ అతనికి అది అసాధ్యం అనిపిస్తే, శత్రువు ఇంకా దూరంలో ఉండగానే శాంతి నిబంధనలను చర్చించడానికి అతను ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతాడు. 33అదే విధంగా, మీరు కూడా మీరు కలిగివున్న ప్రతిదానిని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.
34“ఉప్పు మంచిదే, కాని ఒకవేళ అది తన సారం కోల్పోతే, అది తిరిగి సారవంతంగా ఎలా చేయబడుతుంది? 35అది నేలకు గాని ఎరువు కుప్పకు గాని పనికిరాదు; అది బయట పారవేయబడుతుంది.
“వినడానికి చెవులుగలవారు విందురు గాక!”