లూకా 19:28-48

లూకా 19:28-48 TCV

యేసు ఈ మాటలను చెప్పి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్లారు. ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బెత్పగే, బేతనియ గ్రామాల సమీపంలో ఉన్నప్పుడు, ఆయన తన శిష్యులలో ఇద్దరిని పంపుతూ, “మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్లండి, దానిలో మీరు ప్రవేశించగానే, ఇంతవరకు ఎవ్వరూ ఎక్కని ఒక గాడిదపిల్ల కట్టబడి మీకు కనబడుతుంది. దానిని విప్పి ఇక్కడికి తీసుకురండి. ‘మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు?’ అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపారు. ఆయన పంపినవారు వెళ్లి, వారితో చెప్పినట్లే దానిని చూసారు వారు ఆ గాడిద పిల్లను విప్పుతుంటే, దాని యజమానులు, “మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. అందుకు వారు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు. వారు దానిని యేసు దగ్గరకు తీసుకొనివచ్చి, ఆ గాడిదపిల్ల మీద తమ వస్త్రాలను వేశారు, యేసు దానిపై కూర్చున్నారు. ఆయన వెళ్తుంటే, ప్రజలు దారి పొడుగున తమ బట్టలను పరిచారు. ఒలీవల కొండ నుండి దిగే చోటికి ఆయన సమీపించినప్పుడు, శిష్యుల సమూహమంతా వారు చూసిన అద్బుతాలన్నింటిని బట్టి తమ స్వరాలతో బిగ్గరగా సంతోషంతో: “ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక!” “ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!” అని దేవుని స్తుతించారు. ఆ జనసమూహంలో ఉన్న పరిసయ్యులు కొందరు యేసుతో, “బోధకుడా, నీ శిష్యులను గద్దించు!” అన్నారు. ఆయన వారితో, “నేను చెప్తున్నాను, వీరు ఊరుకుంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి” అన్నాడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని సమీపించినప్పుడు దానిని చూసి దాని గురించి ఏడుస్తూ, “నీకు దేని ద్వార సమాధానం కలుగుతుందో నీవు తెలుసుకొని ఉంటే బాగుండేది, కాని ఇప్పుడది నీ కళ్ళ నుండి దాచబడి ఉంది. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నీవు గ్రహించుకోలేదు కనుక నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా ఒక గట్టు కట్టి అన్ని వైపుల నిన్ను ముట్టడి వేసి అన్ని వైపుల నుండి నిన్ను అరికట్టి, నీ గోడల లోపల ఉన్న నీ పిల్లలతో పాటు నిన్ను భూమిలోకి నలిపి నీలో ఒక రాయి మీద ఇంకొక రాయి నిలబడకుండ చేసే దినాలు వస్తాయి” అని చెప్పారు. యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి, అక్కడ అమ్ముకొనే వారిని తరమడం ప్రారంభించారు. “ ‘నా గృహం ప్రార్థన గృహము’ అని వ్రాయబడి ఉంది, కానీ మీరు దానిని ‘దొంగల గుహగా’ చేశారు” అని అన్నారు. ఆయన ప్రతి రోజు దేవాలయంలో బోధిస్తూ ఉండేవారు. అయితే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రజానాయకులు ఆయనను చంపాలని ప్రయత్నించారు. అయినా ప్రజలందరు ఆయన చెప్పే మాటలను వినాలని ఆయననే హత్తుకుని ఉన్నారు, కనుక వారేమి చేయలేకపోయారు.