మత్తయి 8:5-13

మత్తయి 8:5-13 TCV

యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని సహాయాన్ని కోరాడు. యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని స్వస్థపరచనా?” అన్నాడు. అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే, నా క్రింద సైనికులున్నారు. ఒకడిని ‘వెళ్లు’ అంటే వెళ్తాడు, ‘రా’ అంటే వస్తాడు. నా దాసుని ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న వారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో నిజంగా చెప్తున్నాను. అనేకులు తూర్పు, పడమర నుండి వచ్చి, పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.” అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు! నీవు నమ్మినట్లే నీకు జరుగును” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు స్వస్థపడ్డాడు.