1
1పౌలు అనే, క్రీస్తు యేసు దాసుడనైన నేను, అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కొరకు ప్రత్యేకపరచబడ్డాను. 2ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు. 3ఆయన శరీరరీత్య దావీదు వంశస్థుడు, 4ఆయన మృతులలో నుండి పునరుత్థానుడు అవ్వడం వలన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో#1:4 దేవుని కుమారునిగా అధికారంతో దేవుని కుమారుడని బలముతో ప్రకటించబడెను నిరూపించబడ్డారు. 5యూదేతరులనందరిని ఆయన నామం కొరకు, విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము. 6యేసుక్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన యూదేతరుల మధ్య మీరు కూడా ఉన్నారు.
7రోమాలో దేవునిచే ప్రేమించబడుతున్న ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలవబడిన వారందరికి పౌలు వ్రాయునది:
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.
రోమాను దర్శించాలనే పౌలు కోరిక
8మొదటిగా, మీ అందరి కొరకు యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది. 9నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడే సాక్షి. 10దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు మార్గం తెరవబడాలని ప్రార్థిస్తున్నాను.
11మిమ్మల్ని చూడాలని అలాగే మిమ్మల్ని బలపరచడానికి ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించాలని నేను ఆరాటపడుతున్నాను. 12తద్వారా, మీరు నేను పరస్పరం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరం ప్రోత్సాహించబడతాము. 13సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను కలిగియున్నట్లుగా, మీ మధ్యలో కూడా కోత కలిగియుండాలని నేను మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను, గాని అలా జరుగకుండా ఇప్పటి వరకు నేను నిరోధించబడ్డాను అనే విషయం మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
14గ్రీసు దేశస్థులు గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగివున్నాను. 15అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తి కలిగివున్నాను.
16సువార్త గురించి నేను సిగ్గుపడను, ఎందుకంటే, నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తరువాత యూదేతరులకు రక్షణ కలుగచేయడానికి సువార్త దేవుని శక్తి. 17“నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు”#1:17 హబ 2:4 అని వ్రాయబడివున్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.
పాపులైన మానవులపై దేవుని ఉగ్రత
18ప్రజలు తమ దుష్టత్వం చేత సత్యాన్ని అణిచివేస్తున్నారు, గనుక వారిలో ఉన్న భక్తిహీనత, దుష్టత్వమంతటి మీదకు దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడి చేయబడుచున్నది. 19దేవుడే వారికి స్పష్టం చేశారు కనుక దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి. 20లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా, దేవుని అదృశ్యలక్షణాలైన ఆయన శాశ్వతమైన శక్తి మరియు దైవిక స్వభావం స్ఫష్టంగా కనిపించాయి, కనుక దేవుణ్ణి తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.
21వారు దేవుణ్ణి ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. 22వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. 23వారు నిత్యుడైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల, పక్షుల, జంతువుల, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారు చేసిన విగ్రహాలకు ఆపాదించారు.
24కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు వదిలేసారు. 25వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు, అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.
26అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించాడు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకొన్నారు. 27అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసి, తమ తప్పులకు తగిన శిక్షను పొందారు.
28అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగివుండడం విలువైనదిగా భావించలేదు, కనుక వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. 29వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండివున్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగివున్నారు. వారు వదరుబోతులు, 30అపనిందలు వేస్తారు, దేవుణ్ణి ద్వేషించేవారు, గర్విష్ఠులు, దురహంకారులు, బడాయిమాటలు పలికేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; 31వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. 32ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.