తీతుకు 3

3
రక్షించబడిందే మంచి చేయడానికి
1పరిపాలకులకు అధికారులకు లోబడుతూ విధేయత కలిగి మంచి పనులను చేయడానికి సిద్ధంగా ఉండాలని, 2ఎవరినీ నిందించకూడదని, శాంతియుతంగా వివేకం కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరి పట్ల ఎల్లప్పుడూ సౌమ్యంగా మెలగాలని ప్రజలకు జ్ఞాపకం చేయి.
3ఒకప్పుడు మనం కూడా అవివేకులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారిగా అన్ని రకాల వ్యామోహాలకు సుఖాలకు బానిసలుగా ఉన్నాం. మనం ఓర్వలేనితనంతో, అసూయతో, ద్వేషింపబడుతూ ఒకరిని ఒకరం ద్వేషిస్తూ జీవించాము. 4కాని మన రక్షకుడైన దేవుని దయ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, 5ఆయన మనల్ని రక్షించారు, మనం చేసిన నీతిపనులను బట్టి కాదు కాని, తన కనికరం చేతనే మనం రక్షించబడ్డాము. ఆయన మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను మనపై విస్తారంగా క్రుమ్మరించి, 6ఆ పరిశుద్ధాత్మచే మనల్ని నూతనపరచి, పునర్జన్మ శుద్ధీకరణ ద్వారా ఆయన మనల్ని రక్షించారు. 7కనుక ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడి, నిత్యజీవం గురించి నిరీక్షణ కలిగిన వారసులం అవుతున్నాము. 8ఇది నమ్మదగిన మాట. కనుక దేవుని నమ్మినవారు మంచి పనులను చేయడానికి శ్రద్ధతో పూనుకొనేలా నీవు ఈ విషయాలను మరింత గట్టిగా బోధించాలని చెప్తున్నాను. ఇవి ఉత్తమమైనవి, ప్రతి ఒక్కరికి ప్రయోజనకరమైనవి.
9అయితే మూర్ఖమైన వివాదాలకు, వంశావళులకు, ధర్మశాస్త్రానికి సంబంధించిన వాదాలకు కలహాలకు దూరంగా ఉండు, ఎందుకంటే అవి నిష్ఫలమైనవి వ్యర్థమైనవి. 10విభజనలు కలిగించేవారిని మొదటిసారి గద్దించు, రెండవ సారి హెచ్చరించు. ఆ తరువాత వారిని వదిలివేయి. 11అలాంటివారు చెడిపోయినవారు, పాపాత్ములు; వారు తమను తామే నిందించుకుంటారని నీకు ఖచ్చితంగా తెలుసు.
తుది హెచ్చరికలు
12నేను నికొపోలిలో శీతాకాలం గడపాలని అనుకుంటున్నాను, కనుక నేను ఆర్తెమాను లేదా తుకికును నీ దగ్గరకు పంపిన వెంటనే నీవు బయలుదేరి నికొపోలిలో నా దగ్గరకు రావడానికి సిద్ధంగా ఉండు. 13న్యాయవాది జేనాసు అపొల్లోను జాగ్రత్తగా పంపించు, వారి ప్రయాణానికి కావలసినవన్ని సమకూర్చి తగిన సహాయం చేయి.
14మన ప్రజలు నిష్ఫలమైన జీవితాలను జీవించకుండా అవసరాలకు తగినట్లు మంచి పనులు చేయడంలో శ్రద్ధ వహించడం నేర్చుకోవాలి.
15నాతో వున్న విశ్వాసులందరు నీకు వందనాలు తెలియజేస్తున్నారు.
విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించేవారందరికి మా వందనాలు తెలియజేయి.
దేవుని కృప మీ అందరితో ఉండును గాక.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

తీతుకు 3: TCV

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి