2 సమూయేలు 17

17
1ఇంకా అహీతోపెలు అబ్షాలోముతో, “నేను పన్నెండువేలమంది సైనికులను ఎంపిక చేసుకుని ఈ రాత్రే రాజైన దావీదును వెంటాడడానికి బయలుదేరి వెళ్లనివ్వండి. 2అతడు అలసిపోయి బలహీనంగా ఉన్నప్పుడు నేను అతనిపై దాడిచేసి అతన్ని భయపెడతాను. అప్పుడు అతనితో ఉన్నవారంతా పారిపోతారు. నేను రాజును మాత్రమే చంపి, 3ప్రజలందరినీ నీ దగ్గరకు తీసుకువస్తాను. నీవు వెదకే మనిషి ప్రాణానికి బదులుగా ప్రజలందరు తిరిగి నీ దగ్గరకు వస్తారు. ప్రజలంతా క్షేమంగా ఉంటారు” అన్నాడు. 4ఈ మాట అబ్షాలోముకు ఇశ్రాయేలీయుల పెద్దలందరికి నచ్చింది.
5అప్పుడు అబ్షాలోము, “అర్కీయుడైన హూషైను పిలిపించు. అతడు చెప్పేది కూడా మనం విందాం” అన్నాడు. 6హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చినప్పుడు, “అహీతోపెలు మాకు ఈ సలహా ఇచ్చాడు. అతడు చెప్పింది చేయాలా? ఒకవేళ వద్దంటే, నీ అభిప్రాయమేంటో చెప్పు” అన్నాడు.
7అందుకు హూషై అబ్షాలోముతో, “ఈసారి అహీతోపెలు ఇచ్చిన సలహా మంచిది కాదు. 8హూషై ఇంకా మాట్లాడుతూ, నీ తండ్రి గురించి అతని మనుష్యుల గురించి నీకు తెలుసు; వారు యుద్ధవీరులు, కూనలను పోగొట్టుకున్న అడవి ఎలుగుబంటిలా భయంకరులు. అంతేకాక నీ తండ్రి అనుభవజ్ఞుడైన యుద్ధవీరుడు; అతడు సైన్యంతో రాత్రి గడపడు. 9ఇప్పుడు కూడా అతడు గుహలోనో మరో స్థలంలోనో దాక్కొని ఉంటాడు. అతడు కాబట్టి నీ దళాల మీద మొదట దాడి చేయాల్సివస్తే, దాని గురించి విన్నవారందరు, ‘అబ్షాలోమును అనుసరించే దళాల మధ్య వధ జరిగింది’ అని అంటారు. 10అప్పుడు సింహపు గుండె లాంటి గుండె కలిగిన మహా ధైర్యవంతులైన సైనికులు కూడా భయంతో కరిగిపోతారు, ఎందుకంటే నీ తండ్రి గొప్ప యుద్ధవీరుడని అతనితో ఉన్నవారంతా ధైర్యవంతులని ఇశ్రాయేలీయులందరికి తెలుసు.
11“కాబట్టి నా సలహా ఏంటంటే, దాను నుండి బెయేర్షేబ వరకు సముద్రపు ఇసుకరేణువులంత అసంఖ్యాకంగా ఇశ్రాయేలీయులందరు నీ దగ్గర సమకూడాలి. నీవే స్వయంగా వారిని యుద్ధంలో నడిపించాలి. 12అప్పుడతడు ఎక్కడ కనబడినా మనం అతనిపై దాడి చేద్దాం; నేల మీద మంచు పడినట్లుగా మనం అతని మీద దాడి చేస్తే అతడు గాని అతని మనుష్యులు కాని ప్రాణాలతో తప్పించుకోలేరు. 13ఒకవేళ అతడు ఏదైన పట్టణానికి వెళ్తే, ఇశ్రాయేలీయులందరు ఆ పట్టణానికి త్రాళ్లు తీసుకువచ్చి, అక్కడ చిన్న రాయి కూడా మిగులకుండా ఆ పట్టణాన్ని లోయలోకి లాగివేస్తారు” అన్నాడు.
14అబ్షాలోము ఇశ్రాయేలీయులందరు అది విని, “అర్కీయుడైన హూషై చెప్పిన సలహా అహీతోపెలు చెప్పిన దానికంటే బాగుంది” అన్నారు. ఎందుకంటే యెహోవా అబ్షాలోము మీదికి ఆపద రప్పించడానికి అహీతోపెలు చెప్పిన మంచి ఆలోచనను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు.
15అప్పుడు హూషై వెళ్లి యాజకులైన సాదోకు, అబ్యాతారులతో, “అబ్షాలోముకు ఇశ్రాయేలు పెద్దలందరికి అహీతోపెలు ఇలా చేయండి అని సలహా ఇచ్చాడు, అయితే నేను అలా కాదు ఇలా చేయండి అని సలహా ఇచ్చాను. 16కాబట్టి వెంటనే దావీదుకు, ‘ఈ రోజు రాత్రి అరణ్యంలో రేవుల దగ్గర గడపవద్దు; అక్కడినుండి వెంటనే అటువైపు దాటి వెళ్లండి, లేకపోతే రాజు అతనితో పాటు ఉన్నవారందరు చంపబడతారు’ అని కబురు పంపించండి” అని చెప్పాడు.
17యోనాతాను అహిమయస్సు తాము పట్టణంలోనికి వచ్చిన సంగతి ఎవరికీ తెలియకూడదని వారు ఎన్-రోగేలు దగ్గర ఉన్నారు. ఒక సేవకురాలు వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి చెప్పగా వారు వెళ్లి రాజైన దావీదుకు ఆ సంగతి చెప్పారు. 18కాని ఒక యువకుడు వారిని చూసి అబ్షాలోముకు చెప్పాడు. కాబట్టి వారిద్దరు వెంటనే బయలుదేరి బహూరీములో ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి అతని ఇంటి ప్రాంగణంలో ఉన్న బావి లోపలికి దిగి దాక్కున్నారు. 19అతని భార్య ఒక మూతను తెచ్చి దానిపై గుడ్డను పరచి తెచ్చి బావి మీద పరచి దాని మీద ధాన్యం ఆరబోసింది. కాబట్టి వారు అక్కడ దాక్కున్నారని ఎవరికీ తెలియదు.
20తర్వాత అబ్షాలోము మనుష్యులు ఆ ఇంటి దగ్గరకు వచ్చి, “అహిమయస్సు, యోనాతానులు ఎక్కడ ఉన్నారు?” అని ఆమెను అడిగారు.
అందుకామె, “వారు ఆ వాగు దాటి వెళ్లారు” అని చెప్పింది. ఆ మనుష్యులు వెదికారు గాని ఎవ్వరూ కనబడలేదు, కాబట్టి వారు యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
21ఆ మనుష్యులు వెళ్లిపోయిన తర్వాత యోనాతాను అహిమయస్సులు బావిలో నుండి బయటకు వచ్చి రాజైన దావీదు దగ్గరకు వెళ్లి అతనితో, “మీకు వ్యతిరేకంగా అహీతోపెలు ఆలోచన చేశాడు కాబట్టి మీరు వెంటనే బయలుదేరి యొర్దాను నది దాటి వెళ్లిపోవాలి” అని చెప్పారు. 22కాబట్టి దావీదు, అతనితో ఉన్నవారందరు బయలుదేరి యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి ఒక్కరూ మిగలకుండా అందరు యొర్దాను నది దాటి వెళ్లారు.
23అహీతోపెలు తాను చెప్పిన సలహాను పాటించకపోవడం చూసి, తన గాడిదకు గంతకట్టి తన ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. తన ఇంటి విషయాలు చక్కబెట్టుకున్న తర్వాత ఉరివేసుకుని చనిపోయాడు. అతని తండ్రి సమాధిలో అహీతోపెలు పాతిపెట్టబడ్డాడు.
అబ్షాలోము మరణం
24దావీదు మహనయీముకు చేరుకున్నాడు. అబ్షాలోము ఇశ్రాయేలీయులతో కలిసి యొర్దాను నది దాటి వెళ్లిపోయారు. 25అబ్షాలోము యోవాబుకు బదులుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. అమాశా తండ్రి ఇష్మాయేలీయుడైన#17:25 కొ.ప్రా.ప్ర.లలో ఇశ్రాయేలీయుడైన అని వ్రాయబడింది; 1 దిన 2:17 యెతెరు.#17:25 లేదా యెతెరు ఇత్రా యొక్క మరో రూపం అతని తల్లి అబీగయీలు యోవాబు తల్లియైన సెరూయాకు సోదరియైన నాహాషు కుమార్తె. 26అబ్షాలోము, ఇశ్రాయేలీయులు గిలాదు ప్రాంతంలో శిబిరం ఏర్పరచుకున్నారు.
27దావీదు మహనయీముకు చేరుకున్నప్పుడు అమ్మోనీయుల పట్టణమైన రబ్బాకు చెందిన నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారుకు చెందిన అమ్మీయేలు కుమారుడైన మాకీరు, రోగెలీముకు చెందిన గిలాదీయుడైన బర్జిల్లయిలు, 28పరుపులు, వంట పాత్రలు, కుండలు తీసుకువచ్చారు. ఆహారంగా గోధుమలు, యవలు, పిండి, వేయించిన ధాన్యం, చిక్కుడు కాయలు, పప్పులు, 29తేనె, పెరుగు, గొర్రెలు, ఆవు పాల జున్ను దావీదు, అతనితో ఉన్న ప్రజల కోసం తెచ్చారు. ఎందుకంటే, “అరణ్యంలో ప్రజలు అలసిపోయి, ఆకలితో దాహంతో ఉన్నారు” అని వారు గ్రహించారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

2 సమూయేలు 17: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి