ఎస్తేరు 5

5
రాజు దగ్గర ఎస్తేరు అభ్యర్థన
1మూడవ రోజు ఎస్తేరు తన రాజవస్త్రాలు ధరించి, రాజభవనం లోపలి ఆవరణంలో రాజు గది దగ్గర నిలబడింది. ద్వారానికి ఎదురుగా రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. 2ఆవరణంలో ఎస్తేరు రాణి నిలబడి ఉండడం రాజు చూసినప్పుడు, అతనికి ఆమె పట్ల ఇష్టం కలిగి, తన చేతిలో ఉన్న బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు సమీపించి, ఆ దండం యొక్క అంచును ముట్టుకుంది.
3అప్పుడు రాజు, “ఎస్తేరు రాణి, ఏంటి విషయం? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగమైనా సరే, నీకు ఇవ్వబడుతుంది” అని అన్నాడు.
4ఎస్తేరు జవాబిస్తూ, “రాజుకు ఇష్టమైతే, ఈ రోజు నేను రాజు కోసం సిద్ధం చేయించిన విందుకు మీరు హామానుతో పాటు రావాలి” అన్నది.
5రాజు తన సేవకులతో, “ఎస్తేరు అడిగింది జరిగేలా వెంటనే హామానును తీసుకురండి” అన్నాడు.
కాబట్టి రాజు, హామాను, ఎస్తేరు చేయించిన విందుకు వెళ్లారు. 6వారు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు రాజు మరలా ఎస్తేరుతో, “నీ విన్నపం ఏంటి? అది నీకు ఇస్తాను. నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం అడిగినా సరే నీకు ఇస్తాను” అన్నాడు.
7ఎస్తేరు జవాబిస్తూ, “నా విన్నపం, నా మనవి ఇది: 8రాజుకు నాపై దయ కలిగి, నా అభ్యర్థనను మన్నించి నా మనవిని నెరవేరుస్తానంటే, నేను మీకోసం రేపు ఏర్పాటు చేసే విందుకు రాజైన మీరు, హామాను రావాలి. అప్పుడు నేను రాజు ప్రశ్నకు జవాబిస్తాను” అన్నది.
మొర్దెకై మీద హామాను యొక్క కోపం
9హామాను ఆ రోజు మహానందంతో బయటకు వెళ్లాడు. కాని, రాజభవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి కూడా లేచి నిలబడలేదని తన ఎదుట ఎలాంటి భయం చూపించలేదని చూసి అతనికి మొర్దెకై మీద తీవ్రమైన కోపం వచ్చింది. 10అయినా హామాను తనను తాను నిగ్రహించుకొని ఇంటికి వెళ్లాడు.
తన స్నేహితులను, తన భార్యయైన జెరెషును పిలిచి, 11హామాను గర్వంగా తనకున్న విస్తారమైన ఐశ్వర్యం గురించి, తనకున్న ఎంతోమంది కుమారుల గురించి, రాజు తనను ఎన్ని విధాలుగా ఘనపరిచాడో, ఎలా తనను ఇతర సంస్థానాధిపతుల ఎదుట గౌరవించాడో వారికి గొప్పగా చెప్పుకున్నాడు. 12హామాను ఇంకా మాట్లాడుతూ, “అంతేకాదు, ఎస్తేరు రాణి, తాను ఇస్తున్న విందుకు రాజుతో పాటు రమ్మని నన్ను మాత్రమే పిలిచింది. రేపు విందుకు రాజుతో రమ్మని నన్ను ఆహ్వానించింది. 13అయితే, రాజ ద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైను చూసినంత కాలం ఇదంతా నాకు సంతృప్తినివ్వదు” అని అన్నాడు.
14అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరు, “యాభై మూరల#5:14 అంటే, సుమారు 23 మీటర్లు ఎత్తుగల ఉరికంబం చేయించు. రేపు ఉదయం మొర్దెకైను దాని మీద ఉరి తీయమని రాజుకు చెప్పు. తర్వాత రాజుతో పాటు విందుకు వెళ్లి ఆనందించు” అని అతనికి చెప్పారు. ఈ సలహా హామానుకు నచ్చింది, కాబట్టి అతడు ఉరికంబం చేయించాడు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ఎస్తేరు 5: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి