నిర్గమ 3
3
మోషే, మండుతున్న పొద
1ఈ సమయంలో, మోషే మిద్యానులో యాజకుడైన యెత్రో#3:1 మోషే మామ యెత్రో, రగూయేలు అనే రెండు పేర్లతో పిలువబడేవాడు. అనే తన మామ మందను మేపుతూ, మందను అరణ్యానికి చాలా దూరంగా నడిపించి దేవుని పర్వతమైన, హోరేబు#3:1 హోరేబు సీనాయికి మరొక పేరు. దగ్గరకు వచ్చాడు. 2అక్కడ ఒక పొదలో మండుతున్న అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద అగ్నితో మండుతూ ఉన్నప్పటికీ అది కాలిపోకపోవడం మోషే చూశాడు. 3అప్పుడు మోషే, “నేను అక్కడికి వెళ్లి ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదనే ఆ గొప్ప అద్భుతాన్ని చూస్తాను” అని అనుకున్నాడు.
4దానిని చూడడానికి అతడు అక్కడికి రావడం యెహోవా చూసినప్పుడు, ఆ పొద మధ్యలో నుండి దేవుడు, “మోషే! మోషే!” అని అతన్ని పిలిచారు.
అందుకు మోషే, “నేను ఇక్కడ ఉన్నాను” అన్నాడు.
5అందుకు దేవుడు, “దగ్గరకు రావద్దు, నీవు నిలబడిన స్థలం పరిశుద్ధస్థలం కాబట్టి నీ చెప్పులు విప్పు” అన్నారు. 6ఇంకా ఆయన, “నేను నీ తండ్రి#3:6 కొ.ప్రా.ప్ర. లలో తండ్రులు అపొ. కా. 7:32 దేవుడను, అనగా అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను” అన్నారు. అప్పుడు మోషే దేవుని వైపు చూడడానికి భయపడి, తన ముఖాన్ని దాచుకున్నాడు.
7అప్పుడు యెహోవా, “నేను ఈజిప్టులో ఉన్న నా ప్రజల బాధను చూశాను. వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్న అధికారులను గురించి వారు నాకు చేసిన మొరను నేను విన్నాను, వారి శ్రమల గురించి నాకు తెలుసు. 8కాబట్టి ఈజిప్టువారి చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని తీసుకెళ్లడానికి నేను దిగి వచ్చాను. 9ఇశ్రాయేలీయుల మొర నాకు చేరింది, ఈజిప్టువారు వారినెలా అణచివేస్తున్నారో నేను చూశాను. 10కాబట్టి ఇప్పుడు, వెళ్లు. నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు బయటకు తీసుకురావడానికి నేను నిన్ను ఫరో దగ్గరకు పంపుతున్నాను” అని అన్నారు.
11అయితే మోషే, “ఫరో దగ్గరకు వెళ్లడానికి ఇశ్రాయేలీయులను ఈజిప్టులో నుండి బయటకు తీసుకురావడానికి నేను ఎంతటివాన్ని?” అని దేవునితో అన్నాడు.
12అప్పుడు దేవుడు, “ఖచ్చితంగా నేను నీకు తోడై ఉంటాను. నేను నిన్ను పంపాను అనడానికి ఇది ఒక అసాధారణ గుర్తుగా ఉంటుంది: మీరు ఈజిప్టు నుండి ప్రజలను బయటకు తీసుకువచ్చినప్పుడు, మీరూ ఈ పర్వతం మీద దేవుని ఆరాధిస్తారు” అని చెప్పారు.
13అప్పుడు మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి వారితో, ‘మీ పితరుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పినప్పుడు వారు, ‘ఆయన పేరు ఏమిటి?’ అని నన్ను అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏమి చెప్పాలి?” అని దేవుని అడిగాడు.
14అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”
15దేవుడు మోషేతో, “నీవు ఇశ్రాయేలీయులతో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా#3:15 హెబ్రీలో యెహోవా అనేది నిర్గమ 3:14 లో ఉన్న నేనైయున్నాను అనే దానికి సంబంధించనదిగా అనిపిస్తుంది అనగా అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరకు పంపారు’ అని చెప్పాలి.
“ఇదే నా నిత్యమైన పేరు,
తరతరాల వరకు
మీరు జ్ఞాపకముంచుకోవలసిన పేరు ఇదే.
16“వెళ్లు, ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి వారితో, ‘మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలా అన్నారు: నేను మిమ్మల్ని చూశాను; ఈజిప్టులో మీకు జరిగిన దానిని చూశాను. 17ఈజిప్టు కష్టాల నుండి విడిపించి, కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల దేశం అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రమాణం చేశాను’ అని వారితో చెప్పు.
18“ఇశ్రాయేలీయుల పెద్దలు నీ మాట వింటారు. అప్పుడు నీవు వారితో కలిసి ఈజిప్టు రాజు దగ్గరకు వెళ్లి అతనితో, ‘హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు. మేము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణమంత దూరం వెళ్లి అక్కడ మా దేవుడైన యెహోవాకు బలులు అర్పించేలా మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పాలి. 19అయితే ఈజిప్టు రాజు ఒక బలమైన హస్తం అతన్ని ఒత్తిడి చేస్తేనే తప్ప మిమ్మల్ని పోనివ్వడని నాకు తెలుసు. 20కాబట్టి నేను నా చేతిని చాచి ఈజిప్టువారి మధ్య నేను చేయదలచిన అద్భుత కార్యాలను చేసి వారిని మొత్తుతాను. దాని తర్వాత అతడు మిమ్మల్ని వెళ్లనిస్తాడు.
21“ఈ ప్రజల పట్ల ఈజిప్టువారిలో దయను పుట్టిస్తాను కాబట్టి మీరు వెళ్లినప్పుడు వట్టి చేతులతో వెళ్లరు. 22ప్రతి స్త్రీ తన పొరుగువారిని వారి ఇంట్లో ఉండే స్త్రీని వెండి బంగారు ఆభరణాలను, బట్టలను అడిగి తీసుకుని వాటిని మీ కుమారులకు కుమార్తెలకు ధరింపచేయాలి. ఈ విధంగా మీరు ఈజిప్టువారిని కొల్లగొడతారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
నిర్గమ 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.