ఎజ్రా 3
3
బలిపీఠాన్ని తిరిగి కట్టుట
1ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణాల్లో స్థిరపడినప్పుడు, ప్రజలు ఒక్కటిగా యెరూషలేములో సమావేశమయ్యారు. 2అప్పుడు యోజాదాకు కుమారుడైన యెషూవ, అతని తోటి యాజకులు, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, అతని తోటి పనివారు దైవజనుడైన మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారంగా దహనబలులు అర్పించడానికి ఇశ్రాయేలీయుల దేవునికి బలిపీఠాన్ని కట్టడం మొదలుపెట్టారు. 3వీరికి అక్కడి ప్రజల భయం ఉన్నా, బలిపీఠాన్ని దాని పునాదుల మీదనే కట్టి, ఉదయ సాయంత్రాల్లో యెహోవాకు దహనబలులు క్రమంగా అర్పిస్తూ వచ్చారు. 4తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు. 5దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు. 6యెహోవా ఆలయానికి ఇంకా పునాది వేయనప్పటికి, ఏడవ నెల మొదటి రోజు నుండి వారు యెహోవాకు దహనబలులు అర్పించడం మొదలుపెట్టారు.
మందిరాన్ని తిరిగి నిర్మించుట
7అప్పుడు వారు తాపీ మేస్త్రీలకు, వడ్రంగులకు డబ్బులు ఇచ్చారు. పర్షియా రాజైన కోరెషు ఆదేశం ప్రకారం దేవదారు మ్రానులను సముద్రం ద్వారా లెబానోను నుండి యొప్ప పట్టణానికి చేర్చడానికి సీదోనీయులకు, తూరువారికి భోజనపదార్థాలు, ఒలీవనూనె ఇచ్చారు.
8యెరూషలేములోని దేవుని ఆలయానికి వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ యాజకులు, ఇతర ప్రజలు (యాజకులు, లేవీయులు, బందీ నుండి విడుదల పొంది యెరూషలేముకు వచ్చిన వారందరు) పని ప్రారంభించారు. లేవీయులలో ఇరవై సంవత్సరాలకన్నా ఎక్కువ వయస్సున్న వారిని యెహోవా మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించారు. 9వీరితో పాటు యెషూవ అతని కుమారులు, అతని సోదరులు, కద్మీయేలు అతని కుమారులు (యూదా#3:9 హెబ్రీలో యెహూదా హోదవ్యాకు మరొక రూపం వారసులు), హేనాదాదు కుమారులు, వారి సోదరులైన లేవీయులందరు దేవుని మందిరపు పనిని పర్యవేక్షించడానికి నియమించబడ్డారు.
10నిర్మించేవారు యెహోవా ఆలయానికి పునాది వేసినప్పుడు ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన ప్రకారం యాజకులు ప్రత్యేక వస్త్రాలను ధరించి బూరలు పట్టుకుని, ఆసాపు కుమారులైన లేవీయులు తాళాలు పట్టుకుని యెహోవాను కీర్తించడానికి తమ తమ స్థానాల్లో నిలబడ్డారు. 11కృతజ్ఞతా స్తుతులతో వారు యెహోవాకు ఈ పాట పాడారు:
“ఆయన మంచివారు.
ఇశ్రాయేలీయులపై ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.”
యెహోవా మందిర పునాది వేస్తున్నప్పుడు ప్రజలందరు బిగ్గరగా గొంతెత్తి యెహోవాను స్తుతించారు. 12అయితే గతంలో ఉన్న మందిరాన్ని తమ కళ్లతో చూసిన వృద్ధులైన యాజకులు, లేవీయులు, నాయకులు చాలామంది, ఇప్పుడు వేస్తున్న మందిర పునాదిని చూసి గట్టిగా ఏడ్చారు. మరికొందరు సంతోషంతో కేకలు వేశారు. 13అక్కడ ఉన్న ప్రజలు చాలా పెద్దగా శబ్దం చేయడంతో సంతోషంతో వేసిన కేకలకు, దుఃఖంతో వేసిన కేకలకు తేడా తెలుసుకోలేకపోయారు. ఆ శబ్దం చాలా దూరం వరకు వినబడింది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
ఎజ్రా 3: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.