యెషయా 36

36
సన్హెరీబు యెరూషలేమును భయపెట్టుట
1రాజైన హిజ్కియా పాలన పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. 2అప్పుడు అష్షూరు రాజు లాకీషు నుండి యెరూషలేములో ఉన్న రాజైన హిజ్కియా మీదికి గొప్ప సైన్యంతో తన యుద్ధభూమిలో ఉన్న సైన్యాధిపతిని పంపించాడు. ఆ సైన్యాధిపతి చాకలి రేవు దారిలో ఉన్న పై కోనేటి కాలువ దగ్గర ఆగినప్పుడు, 3హిల్కీయా కుమారుడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు అతని దగ్గరకు వెళ్లారు.
4అప్పుడు సైన్యాధిపతి వారితో ఇలా అన్నాడు, “హిజ్కియాకు చెప్పండి:
“ ‘మహారాజు, అష్షూరు రాజు చెప్పే మాట ఇది: దేన్ని చూసుకుని నీకు ఈ ధైర్యం? 5యుద్ధం విషయంలో నీకు ఆలోచన, బలం ఉంది అంటావు, కాని నీవు మాట్లాడేవి వట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నామీద తిరుగుబాటు చేస్తున్నావు? 6చూడు, నీవు నలిగిన రెల్లులాంటి ఈజిప్టును నమ్ముకుంటున్నావు, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. ఈజిప్టు రాజైన ఫరోను నమ్ముకునే వారందరికి అతడు చేసేది అదే. 7అయితే, “మా దేవుడైన యెహోవా మీద మేము ఆధారపడుతున్నాం” అని మీరు నాతో అంటే, “ఈ బలిపీఠం దగ్గర మీరు ఆరాధించాలి” అని యూదా వారితో యెరూషలేము వారితో చెప్పిన ఆయన ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టింది?
8“ ‘ఇప్పుడు రండి, నా యజమానియైన అష్షూరు రాజుతో బేరం కుదుర్చుకోండి: మీ దగ్గర రెండువేల గుర్రాలకు సరిపడే రౌతులు ఉంటే, నేను వాటిని మీకు ఇస్తాను! 9రథాలు రౌతుల కోసం ఈజిప్టు రాజును నమ్ముకున్నా, మీరు నా యజమాని అధికారులలో అతి అల్పుడైన ఒక్క అధికారినైనా ఎలా ఎదిరించగలరు? 10యెహోవా నుండి అనుమతి లేకుండానే ఈ స్థలంపై దాడి చేసి నాశనం చేయడానికి వచ్చానా? ఈ దేశంపై దాడి చేసి నాశనం చేయమని స్వయాన యెహోవాయే చెప్పారు.’ ”
11అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు సైన్యాధిపతితో, “నీ దాసులమైన మాకు అరామిక్ భాష అర్థం అవుతుంది కాబట్టి ఆ భాషలో మాట్లాడండి. గోడ మీద ఉన్న ప్రజలకు వినిపించేలా హెబ్రీ భాషలో మాట్లాడకండి” అన్నారు.
12అయితే సైన్యాధిపతి జవాబిస్తూ, “ఈ విషయాలు కేవలం మీకు, మీ యజమానికి మాత్రమే చెప్పటానికి నా యజమాని నన్ను పంపాడని, గోడ మీద కూర్చున్న ప్రజలకు కాదనుకున్నారా? వారు కూడా మీలాగే తమ మలం తింటూ తమ మూత్రం త్రాగాల్సిందే” అని అన్నాడు.
13అప్పుడు సైన్యాధిపతి నిలబడి బిగ్గరగా హెబ్రీ భాషలో ఇలా అన్నాడు, “మహారాజైన అష్షూరు రాజు మాటలు వినండి! 14రాజు చెప్పే మాట ఇదే: హిజ్కియా మిమ్మల్ని మోసం చేయకుండ చూసుకోండి. అతడు మిమ్మల్ని విడిపించలేడు. 15హిజ్కియా, ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తారు; ఈ పట్టణం అష్షూరు రాజు చేతికి చిక్కదు’ అని చెప్తూ యెహోవా మీద నమ్మకం ఉంచేలా ప్రేరేపించనివ్వకండి.
16“హిజ్కియా మాటలు వినకండి. అష్షూరు రాజు చెప్పే మాట ఇదే: నాతో సమాధాన ఒప్పందం చేసుకుని, నా దగ్గరకు రండి. అప్పుడు నేను వచ్చేవరకు, మీలో ప్రతి ఒక్కరూ మీ ద్రాక్షచెట్టు పండ్లు, మీ అంజూర చెట్టు పండ్లు తింటూ, మీ బావి నీళ్లు త్రాగుతారు. 17తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశం లాంటి దేశానికి తీసుకెళ్తాను. అది ధాన్యాలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం.
18“హిజ్కియా, ‘యెహోవా మనల్ని విడిపిస్తారు’ అని చెప్తూ మిమ్మల్ని తప్పుత్రోవ పట్టనివ్వకండి. ఇతర దేశాల దేవుళ్ళు ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించారా? 19హమాతు, అర్పదు దేవుళ్ళు ఎక్కడ? సెఫర్వయీము దేవుళ్ళు ఎక్కడ? వారు నా చేతిలో నుండి సమరయను రక్షించగలిగారా? 20ఈ దేశాల దేవుళ్ళలో ఎవరైనా తమ దేశాలను నా చేతిలో నుండి రక్షించగలిగారా? అలాగైతే, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును ఎలా విడిపిస్తారు?”
21అయితే, “అతనికి జవాబివ్వకండి” అని రాజు వారికి ఆజ్ఞాపించడంతో ప్రజలు ఏమి జవాబివ్వకుండా మౌనంగా ఉన్నారు.
22అప్పుడు హిల్కీయా, రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీము, కార్యదర్శియైన షెబ్నా, ఆసాపు కుమారుడు, రాజ్య లేఖికుడైన యోవాహు, తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వెళ్లి అష్షూరు సైన్యాధిపతి చెప్పింది అతనికి తెలియజేశారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 36: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి