యిర్మీయా 16
16
విపత్తు దినం
1అప్పుడు యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది: 2“ఈ స్థలంలో నీవు పెళ్ళి చేసుకుని కుమారులు, కూతుళ్లు కనకూడదు.” 3ఈ దేశంలో పుట్టిన కుమారులు కుమార్తెల గురించి వారి తల్లుల గురించి వారి తండ్రుల గురించి యెహోవా ఇలా అంటున్నారు: 4“వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”
5యెహోవా ఇలా అంటున్నారు: “చనిపోయిన దుఃఖంతో ఉన్న ఇంటికి వెళ్లవద్దు; దుఃఖించడానికీ, సానుభూతి చూపడానికి వెళ్లవద్దు, ఎందుకంటే నేను ఈ ప్రజల నుండి నా సమాధానాన్ని, నా ప్రేమను, నా జాలి వదిలేశాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు. 6“ఈ దేశంలో గొప్పవారు చిన్నవారు అందరు చనిపోతారు. వారు పాతిపెట్టబడరు, వారి కోసం ఎవరు దుఃఖించరు, చనిపోయినవారి కోసం ఎవరూ తమను తాము కోసుకోరు, తల క్షౌరం చేయించుకోరు. 7చనిపోయినవారి కోసం దుఃఖించేవారిని ఓదార్చడానికి ఎవరూ ఆహారం ఇవ్వరు కనీసం తండ్రి తల్లి చనిపోయినా సరే వారిని ఓదార్చేలా త్రాగడానికి ఏమీ ఇవ్వరు.
8“విందు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి తినడానికి, త్రాగడానికి కూర్చోవద్దు. 9ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను.
10“నీవు ఈ సంగతులను ఈ ప్రజలకు చెప్పినప్పుడు, ‘యెహోవా మనపై ఇంత పెద్ద విపత్తును ఎందుకు విధించారు? మేము చేసిన తప్పేంటి? మన దేవుడైన యెహోవాకు విరోధంగా మనం ఏమి పాపం చేశాం?’ 11అప్పుడు వారితో ఇలా చెప్పు, ‘మీ పూర్వికులు నన్ను విడిచిపెట్టి, ఇతర దేవుళ్ళను అనుసరించి, వారిని సేవిస్తూ, ఆరాధించారు. వారు నన్ను విడిచిపెట్టారు నా ధర్మశాస్త్రాన్ని పాటించలేదని యెహోవా ప్రకటిస్తున్నారు. 12అయితే మీరు మీ పూర్వికులకంటే దుర్మార్గంగా ప్రవర్తించారు. మీరందరూ నాకు విధేయత చూపకుండ మీ దుష్ట హృదయాల మొండితనాన్ని ఎలా అనుసరిస్తున్నారో చూసుకోండి. 13కాబట్టి నేను మిమ్మల్ని ఈ దేశం నుండి మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని దేశంలోకి విసిరివేస్తాను, అక్కడ మీరు పగలు రాత్రి ఇతర దేవుళ్ళను సేవిస్తారు, ఎందుకంటే నేను మీకు ఎలాంటి దయ చూపను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు.
14“అయినా, ఆ రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తూ ఇలా చెప్తున్నారు, “అప్పుడు ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు’ అని ఇకపై చెప్పరు, 15అయితే, ‘యెహోవా జీవం తోడు, ఇశ్రాయేలీయులను ఉత్తర దేశం నుండి ఆయన వారిని తరిమేసిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన యెహోవా జీవం తోడు.’ ఎందుకంటే నేను వారిని వారి పూర్వికులకు నేనిచ్చిన దేశానికి మళ్ళీ రప్పిస్తాను.
16“అయితే వారిని పట్టుకోడానికి నేను చాలామంది చేపలు పట్టేవారిని పిలిపిస్తాను. ఆ తర్వాత వారిని ప్రతి పర్వతం మీద కొండమీద రాళ్ల పగుళ్లలో నుండి వేటాడడానికి చాలామంది వేటగాళ్లను పిలుస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు. 17వారి మార్గాలన్నిటిపై నా దృష్టి ఉంది; నాకు కనబడకుండ లేదు, వారి పాపం నా కళ్ళకు దాచబడలేదు. 18వారి దుష్టత్వానికి, పాపానికి రెట్టింపు ప్రతిఫలమిస్తాను, ఎందుకంటే వారు నా దేశాన్ని నిర్జీవమైన తమ నీచమైన విగ్రహాలతో అపవిత్రం చేశారు వారి అసహ్యమైన విగ్రహాలతో నా వారసత్వాన్ని నింపారు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
19యెహోవా, మీరే నా బలం, నా కోట,
ఆపద సమయంలో నాకు ఆశ్రయం,
దేశాలు నీ దగ్గరకు
భూమి అంచుల నుండి వచ్చి,
“మా పూర్వికులు అబద్ధపు దేవుళ్ళు తప్ప మరేమీ కలిగి లేరు.
పనికిరాని విగ్రహాలు వారికి ఏ మేలు చేయలేదు.
20మనుష్యులు తమ దేవుళ్ళను చేసుకుంటారా?
అవును, కానీ వారు దేవుళ్ళు కాదు!”
21“అందుకే నేను వారికి బోధిస్తాను,
ఈసారి వారికి
నా శక్తిని, మహాత్మ్యాన్ని బోధిస్తాను.
అప్పుడు వారు నా పేరు యెహోవా
అని తెలుసుకుంటారు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 16: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.