యిర్మీయా 32
32
యిర్మీయా పొలం కొనుట
1యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో పదవ సంవత్సరంలో అంటే నెబుకద్నెజరు ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరంలో యెహోవా నుండి యిర్మీయాకు వచ్చిన మాట ఇది. 2బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.
3యూదా రాజైన సిద్కియా అతన్ని అక్కడ బంధించి, “నీవు అలా ఎందుకు ప్రవచిస్తున్నావు? పైగా నీవంటున్నావు, ‘యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. 4యూదా రాజైన సిద్కియా బబులోనీయుల#32:4 లేదా కల్దీయుల 5, 24, 25, 28, 29, 43 వచనాల్లో కూడ నుండి తప్పించుకోడు, అతడు బబులోను రాజు చేతికి ఖచ్చితంగా అప్పగించబడతాడు, సిద్కియా అతనితో ముఖాముఖి మాట్లాడతాడు తన కళ్లారా అతన్ని చూస్తాడు. 5అతడు సిద్కియాను బబులోనుకు తీసుకెళ్తాడు, నేను అతని సంగతి చూసే వరకు అతడు అక్కడే ఉంటాడని యెహోవా ప్రకటిస్తున్నారు. ఒకవేళ మీరు బబులోనీయులతో పోరాడితే విజయం సాధించలేరు’ అని చెప్పావు” అన్నాడు.
6యిర్మీయా ఇలా అన్నాడు: “యెహోవా వాక్కు నాకు వచ్చింది: 7నీ మేనమామ షల్లూము కుమారుడైన హనామేలు నీ దగ్గరకు వచ్చి, ‘అనాతోతులో నా పొలాన్ని కొను, ఎందుకంటే ఒక సమీప బంధువుగా దాన్ని కొనడం నీ హక్కు నీ బాధ్యత’ అని చెప్తాడు.
8“అప్పుడు, యెహోవా చెప్పినట్లే, నా బంధువైన హనామేలు కావలివారి ప్రాంగణంలో నా దగ్గరకు వచ్చి, ‘బెన్యామీను ప్రాంతంలోని అనాతోతులో ఉన్న నా పొలాన్ని కొను. దానిని విడిపించి, స్వాధీనపరచుకునే హక్కు నీకుంది కాబట్టి, నీ కోసం దాన్ని కొనుక్కో’ అని అన్నాడు.
“ఇది యెహోవా వాక్కు అని నాకు తెలుసు; 9కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ#32:9 అంటే, సుమారు 200 గ్రాములు వెండి తూకం వేసి ఇచ్చాను. 10నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను. 11అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను. 12నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను.
13“వారి సమక్షంలో నేను బారూకుకు ఈ సూచనలను ఇచ్చాను: 14‘ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ పత్రాలను, అనగా ముద్ర వేసిన కొనుగోలు పత్రాన్ని, ముద్ర వేయని కొనుగోలు పత్రాన్ని తీసుకుని, అవి చాలా కాలం పాటు ఉండేలా వాటిని మట్టికుండలో దాచిపెట్టు. 15ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ఈ దేశంలో మళ్ళీ ఇల్లు, పొలాలు, ద్రాక్షతోటలు కొంటారు.’
16“నేరియా కుమారుడైన బారూకుకు కొనుగోలు పత్రాన్ని ఇచ్చిన తర్వాత, నేను యెహోవాను ఇలా ప్రార్థించాను:
17“అయ్యో, ప్రభువా యెహోవా, మీ గొప్ప శక్తితో, మీ చాచిన బాహువుతో ఆకాశాలను భూమిని సృష్టించారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. 18మీరు వేలమందిపై ప్రేమ చూపిస్తారు కానీ తల్లిదండ్రుల పాపాల శిక్షను వారి తర్వాత వారి పిల్లల ఒడిలోకి తీసుకువస్తారు. ఆయన గొప్ప బలవంతుడైన దేవుడు, ఆయన పేరు సైన్యాల యెహోవా. 19మీ ఉద్దేశాలు గొప్పవి, మీ క్రియలు బలమైనవి. మీ కనుదృష్టి సర్వ మానవాళిపై ఉన్నది; మీరు ప్రతిఒక్కరికి వారి ప్రవర్తనకు, వారి క్రియలకు తగిన ప్రతిఫలమిస్తారు. 20మీరు ఈజిప్టులో సూచకక్రియలు, అద్భుతాలు చేశారు, నేటికీ ఇశ్రాయేలు మధ్య, ఇతర మనుష్యలందరి మధ్య వాటిని కొనసాగిస్తూ మీరు ఇంకా పేరు కీర్తి కలిగించుకుంటున్నారు. 21మీ ప్రజలైన ఇశ్రాయేలీయులను సూచకక్రియలతో, అద్భుతాలతో, బలమైన చేతితో, చాచిన బాహువుతో, గొప్ప భయాన్ని కలిగించి ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చారు. 22మీరు వారి పూర్వికులకు ఇస్తానని ప్రమాణం చేసిన ఈ దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చారు. 23వారు దాని లోపలికి వచ్చి దానిని స్వాధీనం చేసుకున్నారు, కానీ వారు మీకు లోబడలేదు, మీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు; మీరు వారికి ఆజ్ఞాపించినట్లు వారు చేయలేదు. కాబట్టి మీరు వారిపై ఈ విపత్తు అంతా తెచ్చారు.
24“పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముట్టడి దిబ్బలు ఎలా నిర్మించబడ్డాయో చూడండి. ఖడ్గం, కరువు తెగులు కారణంగా పట్టణం దాని మీద దాడి చేస్తున్న బబులోనీయుల చేతులకు అప్పగించబడుతుంది. నీవు చెప్పింది జరగడం ఇప్పుడు నీవే చూస్తున్నావు. 25పట్టణం బబులోనీయుల చేతికి అప్పగించబడినప్పటికీ, యెహోవా, మీరు నాతో, ‘వెండి ఇచ్చి పొలాన్ని కొని, లావాదేవీకి సాక్షులను ఏర్పాటు చేసుకో’ అని చెప్పారు.”
26అప్పుడు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై: 27“నేను యెహోవాను; నేను సర్వ మానవాళికి దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? 28కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నారు: నేను ఈ పట్టణాన్ని బబులోనీయుల చేతికి, బబులోను రాజు నెబుకద్నెజరుకు అప్పగించబోతున్నాను, అతడు దానిని స్వాధీనం చేసుకుంటాడు. 29ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు.
30“ఇశ్రాయేలు, యూదా ప్రజలు తమ చిన్ననాటి నుండి నా దృష్టికి చెడు తప్ప మరి ఏమీ చేయలేదు. నిజానికి, ఇశ్రాయేలు ప్రజలు తమ చేతులు చేసిన వాటితో నాకు కోపం తెప్పించడం తప్ప మరేమీ చేయలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు. 31ఈ పట్టణం కట్టబడిన రోజు నుండి ఇప్పటివరకు నాకు కోపాన్ని, ఉగ్రతను రప్పిస్తూనే ఉన్నది. 32ఇశ్రాయేలు, యూదా ప్రజలు, వారి రాజులు, అధికారులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదా ప్రజలు యెరూషలేములో నివసించేవారు తాము చేసిన వాటన్నిటితో నాకు కోపం రేపారు. 33వారు నావైపు తమ ముఖాలు త్రిప్పక నాకు వెన్ను చూపారు. నేను వారికి పదే పదే బోధించినప్పటికీ, వారు క్రమశిక్షణను అంగీకరించలేదు, స్పందించలేదు. 34నా పేరు కలిగిన మందిరంలో తమ నీచమైన విగ్రహాలను ప్రతిష్ఠించి దానిని అపవిత్రం చేశారు. 35వారు తమ కుమారులను, కుమార్తెలను మోలెకుకు బలి ఇవ్వడానికి బెన్ హిన్నోము లోయలో బయలుకు క్షేత్రాలు కట్టారు. అది నేను వారికి ఆజ్ఞాపించలేదు. యూదా పాపంలో పడి అలాంటి అసహ్యమైనది చేస్తారని కనీసం నా మనస్సులోకి రాలేదు.
36“మీరు ఈ పట్టణం గురించి, ‘ఖడ్గం, కరువు తెగులు కారణంగా అది బబులోను రాజు చేతికి అప్పగించబడుతుంది’ అని అంటున్నారు; అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: 37నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను. 38వారు నాకు ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను. 39నేను వారికి ఏక హృదయాన్ని ఒకే మార్గాన్ని ఇస్తాను, తద్వార వారు ఎల్లప్పుడూ నాకు భయపడతారు, వారికి, వారి తర్వాత వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకు అంతా మేలు జరుగుతుంది. 40నేను వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను: నేను వారికి మేలు చేయడం ఎప్పటికీ మానను, వారు నా నుండి ఎన్నటికీ దూరంగా ఉండకుండ నా పట్ల వారికి భయభక్తులు కలిగిస్తాను. 41నేను వారికి మేలు చేయడంలో నాకు ఆనందం ఉంది కాబట్టి నిజంగా నా పూర్ణహృదయంతో నా పూర్ణాత్మతో వారిని ఈ దేశంలో నాటుతాను.
42“యెహోవా ఇలా అంటున్నారు: నేను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప విపత్తు తెచ్చినట్లే, నేను వారికి వాగ్దానం చేసిన వృద్ధి అంతటిని వారికి ఇస్తాను. 43‘ఇది బబులోనీయుల చేతికి అప్పగించబడి మనుష్యులు జంతువులు లేక పాడైపోయిందని’ మీరు చెప్పే ఈ దేశంలో మరలా పొలాలు కొంటారు. 44బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యిర్మీయా 32: OTSA
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.