నెహెమ్యా 4

4
పునర్నిర్మాణానికి వ్యతిరేకత
1మేము గోడ తిరిగి కడుతున్నామని విన్న సన్బల్లటు తీవ్రమైన కోపంతో ఊగిపోతూ యూదులను అవహేళన చేస్తూ, 2తన స్నేహితుల ఎదుట సమరయ సైనికుల ఎదుట మాట్లాడుతూ, “ఈ బలహీనమైన యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని చేయగలరా? వారే బలి అర్పిస్తారా? ఒక రోజులోనే పనంతా చేసేస్తారా? కాలిపోయి చెత్తకుప్పగా పడి ఉన్న రాళ్లతో మళ్ళీ కడతారా?” అన్నాడు.
3అతని ప్రక్కన నిలబడి ఉన్న అమ్మోనీయుడైన టోబీయా, “వారు కట్టిన గోడ మీదికి నక్క ఎక్కితే అది కూలిపోతుంది” అన్నాడు.
4మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి! 5వారు కడుతున్నవారిని అడ్డుకుని నీకు కోపం పుట్టించారు కాబట్టి వారి దోషాలను కప్పివేయకండి వారి పాపాలను తుడిచివేయకండి.
6ప్రజలు హృదయపూర్వకంగా పనిచేశారు కాబట్టి సగం ఎత్తు వరకు గోడలు కట్టగలిగాము.
7సన్బల్లటు, టోబీయా, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము గోడలు బాగుచేసే పని కొనసాగుతుందని, బీటలన్నిటిని మూసివేస్తున్నారని విన్నప్పుడు వారు చాలా కోప్పడ్డారు. 8యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి పనిని అడ్డుకోవాలని వారంతా కలిసి కుట్రపన్నారు. 9అయితే మేము మా దేవునికి ప్రార్థించి వారి నుండి కాపాడుకోడానికి రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము.
10అప్పుడు యూదా వారు, “పనివారి బలం తగ్గిపోతుంది. చెత్త చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక మేము గోడ కట్టలేం” అన్నారు.
11మా శత్రువులు, “వారికి తెలిసేలోపు మనలను చూడకముందే, మనం వారి మధ్యకు వెళ్లి వారిని చంపి పని ఆపివేద్దాం” అని ఆలోచన చేశారు.
12మా శత్రువులకు దగ్గరలో నివసించే యూదులు వచ్చి, “మీరు ఎటు తిరిగినా వారు మాపై దాడి చేస్తారు” అని పది కన్న ఎక్కువసార్లు చెప్పారు.
13అందువల్ల గోడ వెనుక దిగువ ప్రాంతాల్లో పైనున్న స్థలాల్లో కుటుంబాల ప్రకారం వారికి కత్తులు ఈటెలు విల్లులు ఇచ్చి కాపలా కాయడానికి నియమించాను. 14అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత నేను లేచి సంస్థానాధిపతులతో, అధికారులతో మిగిలిన ప్రజలందరితో, “మీరు భయపడకండి. గొప్పవాడు, అద్భుతమైన వాడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాల కోసం మీ కుమారులు కుమార్తెల కోసం, మీ భార్యల కోసం మీ ఇళ్ళ కోసం పోరాడండి” అని చెప్పాను.
15తమ కుట్ర గురించి మాకు తెలిసిందని దేవుడు వారి కుట్ర భంగం చేశారని మా శత్రువులు వినగానే, మాలో ప్రతి ఒక్కరు తమ పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు.
16ఆ రోజు నుండి నా పనివారిలో సగం మంది పని చేస్తుండగా మిగతా సగం మంది ఈటెలు డాళ్లు విండ్లు కవచాలు ధరించి వచ్చారు. గోడ కట్టే యూదా కుటుంబాలన్నిటి వెనుక అధికారులు నిలబడి ఉన్నారు. 17బరువులు మోసేవారు ఒక చేతితో తమ పని చేస్తూ మరో చేతితో ఆయుధం పట్టుకున్నారు. 18కట్టే ప్రతి ఒక్కరు కడుతున్నప్పుడు తన కత్తి నడుముకు బిగించుకుని ఉన్నారు. బూర ఊదేవాడు నా దగ్గరే నిలబడ్డాడు.
19అప్పుడు నేను సంస్థానాధిపతులతో, అధికారులతో, మిగిలిన వారితో, “మనం చేస్తున్న పని చాలా విస్తారమైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం చాలా దూరంగా ఉన్నాము. 20కాబట్టి మీకు ఎక్కడ నుండి బూరధ్వని వినబడుతుందో అక్కడికి మీరందరు వచ్చి మాతో కలవాలి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తారు” అన్నాను.
21ఆ విధంగా మేము పని చేశాము; మాలో సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెలు పట్టుకుని నిలబడ్డారు. 22ఆ సమయంలో నేను ప్రజలతో, “ప్రతి వ్యక్తి తన పనివారితో కలసి రాత్రివేళ యెరూషలేములోనే ఉండాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపలాగా ఉంటారు, పగలు పని చేస్తారు” అని చెప్పాను. 23ఈ విధంగా నేను గాని నా బంధువులు గాని నా సేవకులు గాని, నా వెంట ఉన్న కావలివారు గాని బట్టలు విప్పలేదు. నీరు త్రాగడానికి వెళ్లినప్పుడు కూడా ఎవరూ ఆయుధాన్ని వదిలిపెట్టలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

నెహెమ్యా 4: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి