యోహాను 2:1-11

యోహాను 2:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:1-11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

మూడవ రోజున గలిలయ ప్రాంతంలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన శిష్యులు ఆ వివాహానికి పిలువబడ్డారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు, యేసు తల్లి ఆయనతో, “ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. అందుకు యేసు, “అమ్మా, దాంతో మనకేంటి? నా సమయం ఇంకా రాలేదు” అన్నారు. ఆయన తల్లి పరిచారకులతో, “ఆయన మీతో చెప్పేది చేయండి” అని చెప్పింది. అక్కడ ఆరు రాతి నీటి బానలు ఉన్నాయి, యూదులు శుద్ధీకరణ ఆచారం కొరకు వాడుతారు, ఒక్కొక్క దానిలో వంద లీటర్ల నీళ్ళు పడతాయి. యేసు “ఆ బానలను నీటితో నింపండి” అని చెప్పారు; కనుక ఆ పరిచారకులు వాటిని అంచుల వరకు నింపారు. ఆయన వారితో, “ఇప్పుడు అందులో నుండి ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి” అని చెప్పారు. వారు ఆ విధంగా చేసినప్పుడు, ఆ విందు ప్రధాని ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని రుచి చూసాడు. ఆ నీటిని తెచ్చిన పరిచారకులకు తప్ప, అది ఎక్కడ నుండి వచ్చిందో అతనికి తెలియలేదు. కనుక అతడు పెండ్లికుమారుని ప్రక్కకు పిలిచి, “అందరు మొదట మంచి ద్రాక్షరసాన్ని పోసి, అతిథులు తాగలేని స్థితిలో ఉన్నప్పుడు చౌక ద్రాక్షరసాన్ని పోస్తారు, కాని నీవైతే ఇప్పటి వరకు మంచి ద్రాక్షరసాన్నే ఉంచావు” అన్నాడు. గలిలయ ప్రాంతపు కానాలో యేసు ఈ మొదటి అద్బుతం చేసి తన మహిమను కనుపరిచారు. దీని వలన ఆయన శిష్యులు ఆయనను నమ్మారు.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మూడవ రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడే ఉంది. ఆ పెళ్ళికి యేసునూ ఆయన శిష్యులనూ కూడా పిలిచారు. విందులో ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసు తల్లి ఆయనతో, “వీళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయింది” అని చెప్పింది. యేసు ఆమెతో, “అయితే నాకేంటమ్మా? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు. ఆయన తల్లి పనివారితో, “ఆయన మీకు ఏం చెబుతాడో అది చేయండి” అంది. యూదుల సంప్రదాయం ప్రకారం శుద్ధి చేసుకోడానికి సుమారు నూరు లీటర్ల నీళ్ళు పట్టే ఆరు రాతి బానలు అక్కడ ఉన్నాయి. యేసు, “ఆ బానలను నీళ్లతో నింపండి” అన్నాడు. వారు అలాగే వాటిని నిండుగా నింపారు. అప్పుడు ఆయన, “ఇప్పుడు బానలో నుంచి కొంచెం రసం విందు ప్రధాన పర్యవేక్షకుడి దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. వారు అలాగే తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీటిని విందు ప్రధాన పర్యవేక్షకుడు రుచి చూశాడు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియలేదు (కానీ దాన్ని తీసుకుని వచ్చిన పనివాళ్ళకు మాత్రం తెలుసు). అప్పుడు అతడు పెళ్ళి కొడుకుని పిలిపించి అతనితో, “అందరూ ముందు నాణ్యమైన ద్రాక్షరసం ఇస్తారు. అందరూ తాగి మత్తుగా ఉన్నప్పుడు చౌకబారు రసం పోస్తారు. అయితే నువ్వు చివరి వరకూ నాణ్యమైన రసాన్ని ఉంచావు” అన్నాడు. యేసు చేసిన అద్భుతాల్లో ఈ మొదటి దాన్ని ఆయన గలిలయకు చెందిన కానాలో చేసి, తన మహిమను ప్రకటించాడు. దీని వలన ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.

షేర్ చేయి
Read యోహాను 2

యోహాను 2:1-11 పవిత్ర బైబిల్ (TERV)

మూడవరోజు గలిలయ దేశంలోని “కానా” పట్టణంలో ఒక పెళ్ళి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు, ఆయన అనుచరులు కూడా ఆ పెళ్ళికి ఆహ్వానించబడ్డారు. ద్రాక్షారసం అయిపోయాక యేసు తల్లి ఆయనతో, “వాళ్ళ దగ్గర ద్రాక్షారసం అయిపోయింది!” అని చెప్పింది. యేసు, “నాకెందుకు చెబుతున్నావమ్మా! నా సమయమింకా రాలేదు!” అని సమాధానం చెప్పాడు. ఆయన తల్లి పనివాళ్ళతో, “ఆయన చెప్పినట్లు చెయ్యండి!” అని అనింది. ప్రక్కనే రాతితో చేయబడిన ఆరు బానలు ఉన్నాయి. అలాంటి బానల్ని యూదులు ఆచారపు స్నానం చేసి పరిశుద్ధం కావటానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్క బానలో ఎనభై నుండి నూరు లీటర్ల దాకా నీళ్ళు పట్టేవి. యేసు పనివాళ్ళతో, “ఆ బానల్ని నీళ్ళతో నింపండి!” అని అన్నాడు. వాళ్ళు బానల నిండా నీళ్ళు నింపారు. ఆ తర్వాత యేసు వాళ్ళతో, “ఇప్పుడు ఒక బానలో నుంచి కొద్దిగా తీసి పెళ్ళి పెద్ద దగ్గరకు తీసుకెళ్ళండి” అని అన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. ఆ పెళ్ళి పెద్ద, ద్రాక్షారసంగా మారిన ఆ నీళ్ళు రుచి చూసాడు. ఆ పనివాళ్ళకు అది ఎక్కడనుండి వచ్చిందో తెలుసు. కానీ ఆ పెళ్ళి పెద్దకు అది ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కాలేదు. కనుక అతుడు పెళ్ళి కుమారుణ్ణి ప్రక్కకు పిలిచి అతనితో, “అందరూ మంచి ద్రాక్షారసమును మొదట పోస్తారు. అతిథులంతా త్రాగి మత్తులయ్యాక మాములు ద్రాక్షారసమును పోస్తారు. కాని నీవు మంచి ద్రాక్షారసమును యింతవరకు ఎందుకు దాచావు?” అని అన్నాడు. యేసు చేసిన అద్భుతాలలో యిది మొదటిది. ఇది గలిలయలోని కానాలో జరిగింది. ఈ విధంగా ఆయన తన మహిమను చాటాక ఆయన శిష్యులకు ఆయన పట్ల విశ్వాసం కలిగింది.

షేర్ చేయి
Read యోహాను 2