ఆది 47

47
1యోసేపు వెళ్లి ఫరోతో, “నా తండ్రి, నా సోదరులు కనాను దేశం నుండి వారి గొర్రెల మందలు, పశువులు, వారి సమస్తంతో వచ్చారు, ఇప్పుడు గోషేనులో ఉన్నారు” అన్నాడు. 2అతడు తన సోదరులలో అయిదుగురిని ఫరోకు ఎదుట కనుపరిచాడు.
3ఫరో ఆ సోదరులతో, “మీ వృత్తి ఏంటి?” అని అడిగాడు.
“మీ దాసులు మా పూర్వికుల్లా గొర్రెల కాపరులు” అని వారు ఫరోకు జవాబిచ్చారు. 4వారు అతనితో, “మేము కొంతకాలం ఇక్కడ నివసించడానికి వచ్చాం ఎందుకంటే కనానులో కరువు తీవ్రంగా ఉంది, మీ దాసుల గొర్రెల మందలకు మేత లేదు. కాబట్టి ఇప్పుడు మీ దాసులను గోషేనులో నివసించనివ్వండి” అని కూడా అన్నారు.
5ఫరో యోసేపుతో, “నీ తండ్రి, సోదరులు నీ దగ్గరకు వచ్చారు, 6ఈజిప్టు దేశమంతా నీ ముందుంది; శ్రేష్ఠమైన ప్రాంతంలో నీ తండ్రిని, నీ సోదరులను ఉంచు. గోషేనులో వారు నివసించవచ్చు. వీరిలో ప్రత్యేక సామర్థ్యం కలిగినవారు ఎవరైనా ఉంటే, నా సొంత పశువులకు ముఖ్య కాపరులుగా నియమించు” అన్నాడు.
7తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును తీసుకువచ్చి ఫరో ఎదుట కనుపరిచాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత, 8ఫరో, “నీ వయసెంత?” అని అడిగాడు.
9యాకోబు ఫరోతో, “నేను యాత్రచేసిన సంవత్సరాలు నూట ముప్పై. నేను బ్రతికిన సంవత్సరాలు తక్కువ, అవి కూడా శ్రమతో నిండి ఉన్నాయి, అవి నా పూర్వికుల యాత్ర సంవత్సరాలతో సమానం కాదు” అని అన్నాడు. 10తర్వాత యాకోబు ఫరోను దీవించి, అతని ఎదుట నుండి వెళ్లిపోయాడు.
11కాబట్టి యోసేపు తన తండ్రిని, తన సోదరులను ఈజిప్టులో స్థిరపరచి, దేశంలో శ్రేష్ఠమైన భాగంలో, ఫరో చెప్పినట్టు రామెసేసు జిల్లాను వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. 12యోసేపు తన తండ్రికి, తన సోదరులకు, తన తండ్రి ఇంటివారికందరికి వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారాన్ని కూడా అందించాడు.
యోసేపు, కరువు
13అయితే దేశమంతటిలో ఆహారం లేదు ఎందుకంటే కరువు తీవ్రంగా ఉంది; ఈజిప్టు కనాను దేశాలు కరువును బట్టి ఆకలితో అలమటించాయి. 14యోసేపు ఈజిప్టు కనాను దేశాలకు, ధాన్యం కొనుగోలుకు వచ్చిన డబ్బు మొత్తం సేకరించి ఫరో రాజభవనానికి తెచ్చాడు. 15ఈజిప్టు కనాను ప్రజల డబ్బు అయిపోయినప్పుడు, ఈజిప్టు వారంతా యోసేపు దగ్గరకు వచ్చి, “మాకు ఆహారం ఇవ్వండి. మీ కళ్లముందే మేము ఎందుకు చావాలి? మా డబ్బంతా అయిపోయింది” అని అన్నారు.
16అందుకు యోసేపు, “అలాగైతే మీ పశువులను తీసుకురండి, మీ డబ్బు అయిపోయింది కాబట్టి మీ పశువులకు బదులుగా నేను ఆహారం సరఫరా చేస్తాను” అని అన్నాడు. 17కాబట్టి వారు యోసేపు దగ్గరకు తమ పశువులను తెచ్చారు. వారి గుర్రాలు, గొర్రెలు, మేకలు, పశువులు, గాడిదలకు బదులుగా వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరమంతా వారి పశువులకు బదులుగా ఆహారం అందించాడు.
18సంవత్సరం ముగిసిన తర్వాత, మరుసటి సంవత్సరం వారు అతని దగ్గరకు వచ్చి, “మేము మా ప్రభువు నుండి నిజాన్ని దాచలేము, మా డబ్బు అయిపోయింది, మా పశువులు మీకే ఇచ్చాం, ఇక మా శరీరాలు, మా భూమి తప్ప మా ప్రభువుకు ఇవ్వడానికి ఏమీ మిగల్లేదు. 19మేము, మా భూమి మీ కళ్లముందే నశించడం బాగుంటుందా? ఆహారం కోసం మమ్మల్ని, మా భూములను కొనండి. మేము మా భూములతో సహా ఫరోకు బానిసలమవుతాము. మేము చావకుండ బ్రతికేలా పొలాలు పాడైపోకుండ మాకు విత్తనాలు ఇవ్వండి” అని మనవి చేసుకున్నారు.
20కాబట్టి యోసేపు ఫరో కోసం ఈజిప్టు భూమి అంతా కొన్నాడు. ఈజిప్టు వారంతా కరువు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తమ భూములన్నీ అమ్మివేశారు. భూమి ఫరో ఆధీనంలోనికి వచ్చింది, 21యోసేపు ఈజిప్టు యొక్క సరిహద్దు నుండి ఇంకొక సరిహద్దు వరకు ఉన్న ప్రజలందరినీ బానిసలుగా చేశాడు. 22అయితే, యాజకులకు చెందిన భూమిని మాత్రం అతడు కొనలేదు. ఎందుకంటే వారు క్రమంగా ఫరో నుండి బత్తెం పొందుకునే వారు, ఆ బత్తెంతో వారికి సరిపడే ఆహారం ఉంది. కాబట్టి వారు తమ భూమిని అమ్మలేదు.
23యోసేపు ప్రజలతో, “నేను మీ భూములను మిమ్మల్ని ఈ రోజు ఫరో కోసం కొన్నాను. ఇదిగో మీరు భూమిలో నాటడానికి విత్తనాలు తీసుకోండి. 24అయితే పంట వచ్చినప్పుడు అయిదవ వంతు ఫరోకు ఇవ్వండి. మిగితా నాలుగు వంతులు మీ పొలాల్లో విత్తనం కోసం, మీకూ మీ ఇంటివారికి మీ పిల్లలకు ఆహారం కోసం ఉంచుకోండి” అన్నాడు.
25అప్పుడు వారు, “మీరు మా జీవితాలను కాపాడారు. ప్రభువా, మామీద మీ దయ ఉంచండి; మేము ఫరోకు బానిసలుగా ఉంటాం” అని అన్నారు.
26కాబట్టి యోసేపు ఈజిప్టు దేశాన్ని ఉద్దేశించి శాసనం నియమించాడు. అది నేటి వరకు ఉంది. పంటంతటిలో అయిదవ వంతు ఫరోకు చెందుతుంది. అయితే యాజకుల స్థలం మాత్రం ఫరోకు చెందలేదు.
27ఇశ్రాయేలీయులు ఈజిప్టులో గోషేను ప్రదేశంలో స్థిరపడ్డారు. అక్కడ స్వాస్థ్యం సంపాదించుకుని ఫలించి, సంతానాభివృద్ధి చెందుతూ వేగంగా విస్తరించారు.
28యాకోబు ఈజిప్టులో పదిహేడు సంవత్సరాలు జీవించాడు, అతడు జీవించిన సంవత్సరాలు నూట నలభై ఏడు. 29ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు, 30నా పితరులతో నేను నిద్రించినప్పుడు, ఈజిప్టు నుండి నన్ను తీసుకెళ్లి వారు పాతిపెట్టబడిన దగ్గరే నన్ను పాతిపెట్టు” అని చెప్పాడు.
“నీవు చెప్పినట్టే చేస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు.
31అయితే యాకోబు, “నాతో ప్రమాణం చేయి” అని అన్నాడు. అప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు, ఇశ్రాయేలు తన చేతికర్ర మీద ఆనుకుని ఆరాధించాడు.#47:31 గ్రీకులో ఈ పదం యొక్క అర్థం ఆరాధించడం, తల వంచడం, వంగడం అలాగే హెబ్రీ 11:21 చూడండి

ที่ได้เลือกล่าสุด:

ఆది 47: OTSA

เน้นข้อความ

แบ่งปัน

คัดลอก

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้