మత్తయి 7

7
ఇతరులకు తీర్పు తీర్చుట
1“తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు కూడ తీర్పు తీర్చబడదు. 2మీరు ఇతరులకు తీర్పు తీర్చినట్లే, మీకు తీర్పు తీర్చబడుతుంది, మీరు ఏ కొలతతో కొలుస్తారో, మీకు అదే కొలత కొలవబడుతుంది.
3“నీ కంటిలో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తావు? 4ఎప్పుడూ నీ కంటిలో దూలాన్ని ఉంచుకొని నీ సహోదరునితో, ‘నీ కంటిలో ఉన్న నలుసును తీయనివ్వు?’ అని నీవెలా అనగలవు? 5ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయు, అప్పుడు నీ సహోదరుని కంటిలోని నలుసును తీసివేయడానికి నీకు స్పష్టంగా కనిపిస్తుంది.
6“పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్ళతో వాటిని త్రొక్కివేసి, అవి మీ మీద పడి మిమ్మల్ని ముక్కలుగా చేయవచ్చు.
అడగండి, వెదకండి, తట్టండి
7“అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి, మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది. 8ఎందుకంటే, అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.
9“మీలో ఎవరైనా, మీ కుమారుడు రొట్టె అడిగితే, రాయి ఇస్తారా? 10లేక చేప అడిగితే, పాము ఇస్తారా? 11మీరు చెడ్డవారైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులను ఇవ్వాలని మీకు తెలిసినప్పుడు, మీ పరలోకపు తండ్రి తనను అడిగేవారికి ఇంకెంతగా మంచి బహుమానాలు ఇస్తారు! 12కనుక అన్ని విషయాలలో, ఇతరులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో మీరు వారికి అలాగే చేయండి, ఎందుకంటే ధర్మశాస్త్రం, ప్రవక్తలు చెప్పిన సారాంశం ఇదే.
ఇరుకు, విశాల మార్గాలు
13“ఇరుకు ద్వారం గుండా ప్రవేశించండి. నాశనానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, దారి విశాలంగా ఉంటుంది, అనేకమంది దానిలోనికి ప్రవేశిస్తారు. 14అయితే జీవానికి వెళ్లే ద్వారం చిన్నగా, దాని దారి ఇరుకుగా ఉంటుంది, కొంతమందే దాని కనుగొంటారు.
అబద్ధ ప్రవక్తలు
15“అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 16వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. ముళ్లపొదల్లో ద్రాక్షపండ్లను, పల్లేరు మొక్కల్లో అంజూరపు పండ్లను ప్రజలు కోస్తారా? 17అలాగే, ప్రతి మంచిచెట్టు మంచిపండ్లు కాస్తుంది. చెడ్డచెట్టు చెడ్డపండ్లు కాస్తుంది. 18మంచిచెట్టు చెడ్డపండ్లు కాయదు, చెడ్డచెట్టు మంచిపండ్లు కాయదు. 19మంచిపండ్లు కాయని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. 20అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు.
నిజమైన, అబద్ధ శిష్యులు
21“ ‘ప్రభువా, ప్రభువా’ అని పిలిచే ప్రతి ఒక్కరు పరలోకరాజ్యంలో ప్రవేశించరు, కాని పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు. 22ఆ రోజున చాలామంది నాతో, ‘ప్రభువా, ప్రభువా, మేము నీ పేరట ప్రవచించలేదా? నీ పేరట దయ్యాలను వెళ్లగొట్టలేదా? నీ పేరట అనేక అద్బుతాలను చేయలేదా?’ అని అంటారు. 23అప్పుడు నేను వారితో, ‘మీరు ఎవరో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అని స్పష్టంగా చెప్తాను.
బుద్ధిమంతులు, బుద్ధిహీనులైన నిర్మాణకులు
24“కావున నేను చెప్పిన ఈ మాటలు విని, వాటి ప్రకారం చేసే ప్రతి ఒక్కరు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని లాంటివారు. 25వాన కురిసి, వరదలు వచ్చి, గాలులు వీచి, ఆ ఇంటిని కొట్టాయి; అయినా ఆ ఇల్లు కూలిపోలేదు, ఎందుకంటే దాని పునాది బండ మీద ఉంది. 26కానీ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని లాంటివారు. 27వాన కురిసి, వరదలు వచ్చి, గాలులు వీచి, ఆ ఇంటిని కొట్టాయి, అప్పుడు గొప్ప శబ్దంతో అది కూలిపోయింది.”
28యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. 29ఎందుకంటే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా కాక, ఒక అధికారం కలవానిగా బోధించారు.

Поточний вибір:

మత్తయి 7: TCV

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть