జెకర్యా 13

13
పాపం నుండి శుద్ధి
1“ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.
2“ఆ రోజున విగ్రహాల పేర్లు ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా దేశంలోని నుండి నేను వాటిని నిర్మూలిస్తాను. ప్రవక్తలను అపవిత్ర ఆత్మను దేశంలో లేకుండా చేస్తాను” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు. 3“ఇంకా ఎవరైనా ప్రవచనాలు చెప్తూ ఉంటే, ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు వారితో, ‘నీవు యెహోవా పేరట అబద్ధాలు చెప్తున్నావు కాబట్టి నీవు చావాలి’ అని అంటారు. వారు ప్రవచనం చెప్తే, వారి కన్న తల్లిదండ్రులే వారిని పొడుస్తారు.
4“ఆ రోజున ప్రతి ప్రవక్త తాము చెప్పిన ప్రవచనం బట్టి దర్శనం బట్టి సిగ్గుపడి ఇకపై ప్రజలను మోసగించడానికి ప్రవక్త గొంగళి ధరించడం మానేస్తారు. 5ప్రతి ఒక్కరు, ‘నేను ప్రవక్తను కాను. నేను ఒక రైతును; నా చిన్నప్పటి నుండి నన్ను కొన్న వాని దగ్గర పొలంలో పని చేస్తున్నాను’ అంటారు. 6‘నీ చేతులకు గాయాలేంటి?’ అని ఎవరైనా వారిని అడిగితే, ‘ఇవి నేను నా స్నేహితుల ఇంట్లో ఉన్నప్పుడు తగిలిన గాయాలు’ అంటారు.
కాపరి కొట్టబడుట, గొర్రెలు చెదరిపోవుట
7“ఖడ్గమా, మేలుకో, నా గొర్రెల కాపరి మీద
నా సన్నిహితుడి మీద పడు!”
అని సైన్యాల యెహోవా అంటున్నారు.
“కాపరిని కొడతాను,
గొర్రెలు చెదిరిపోతాయి,
చిన్నవారి మీద నేను నా చేతిని ఉంచుతాను.”
8యెహోవా అంటున్నారు, “దేశమంతటిలో
మూడింట రెండు వంతుల ప్రజలు హతమై నశిస్తారు;
అయినా దేశంలో మూడవ వంతు ప్రజలు మిగిలి ఉంటారు.
9ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి
వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను
బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను.
వారు నా పేరట మొరపెడతారు,
నేను వారికి జవాబిస్తాను.
‘వారు నా ప్రజలు’ అని నేనంటాను,
‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”

ማድመቅ

ያጋሩ

ኮፒ

None

ያደመቋቸው ምንባቦች በሁሉም መሣሪያዎችዎ ላይ እንዲቀመጡ ይፈልጋሉ? ይመዝገቡ ወይም ይግቡ