YouVersion Logo
Search Icon

1 కొరింథీయులకు 16

16
1పరిశుద్ధులకొరకైన కానుకవిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. 2నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. 3నేను వచ్చి నప్పుడు మీరెవరిని యోగ్యులని యెంచి పత్రికలిత్తురో, వారిచేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. 4నేను కూడ వెళ్లుట యుక్తమైనయెడల వారు నాతోకూడ వత్తురు. 5అయితే మాసిదోనియలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియలో సంచారమునకు వెళ్లినప్పుడు మీయొద్దకు వచ్చెదను. 6అప్పుడు మీయొద్ద కొంతకాలము ఆగవచ్చును, ఒక వేళ శీతకాలమంతయు గడుపుదును. అప్పుడు నేను వెళ్లెడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును.
7-8ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీ క్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనస్సులేదు. 9కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించియున్నది;#16:9 మూలభాషలో–గొప్ప ద్వారము నాకు తెరువబడియున్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకొస్తువరకు ఎఫెసులో నిలిచియుందును.
10తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడైయుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు 11గనుక ఎవడైన అతనిని తృణీకరింప వద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానముతో సాగనంపుడి; అతడు సహోదరులతోకూడ వచ్చునని యెదురు చూచుచున్నాను. 12సహోదరుడైన అపొల్లోనుగూర్చిన సంగతి ఏమనగా, అతడీ సహోదరులతోకూడ మీయొద్దకు వెళ్లవలెనని నేనతని చాల బతిమాలుకొంటిని గాని, యిప్పుడు వచ్చుటకు అతనికి ఎంతమాత్రమును మనస్సులేదు, వీలైనప్పుడతడు వచ్చును.
13మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి; 14మీరుచేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
15స్తెఫను ఇంటివారు అకయయొక్క ప్రథమఫలమై యున్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని యున్నారనియు మీకు తెలియును. 16కాబట్టి సహోదరులారా, అట్టివారికిని, పనిలో సహాయముచేయుచు ప్రయాసపడుచుఉండు వారికందరికిని మీరు విధేయులై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. 17-18స్తెఫను, ఫొర్మూనాతు, అకా యికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరులేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మా నించుడి.
19ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. 20సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
21పౌలను నేను నా చేతితోనే వందన వచనము వ్రాయు చున్నాను. 22ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు#16:22 లేక, ఆదిమ భాషలో– ‘మరన్‌ఆత’ అనగా ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువు వచ్చియున్నాడు, లేక ప్రభువా రమ్ము. 23ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. 24క్రీస్తుయేసునందలి నా ప్రేమ మీయందరితో ఉండును గాక. ఆమేన్.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in