YouVersion Logo
Search Icon

1 సమూయేలు 16

16
1అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను – ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. 2సమూయేలు–నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా –నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి 3యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా 4సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి–సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా 5అతడు–సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. 6వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను 7అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 8యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను. 9అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు –యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. 10యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి 11నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా 12అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా 13సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.
14యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా 15సౌలు సేవకులు–దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది; 16మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పెట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి 17సౌలు–బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు 18–చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా 19సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను. 20అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను. 21దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను. 22అంతట సౌలు–దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను. 23దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in