1 సమూయేలు 20
20
1పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి–నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమనియడుగగా 2యోనాతాను–ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమేగాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా 3దావీదు–నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణముచేయగా 4యోనాతాను–నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదుననెను. 5అందుకు దావీదు–రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. 6ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. –దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను. 7అతడు–మంచిదని సెలవిచ్చినయెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యముగలవాడై యున్నాడని నీవు తెలిసికొని 8నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా 9యోనాతాను–ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా 10దావీదు–నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను. 11అందుకు యోనాతాను–పొలములోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి.
12అప్పుడు యోనాతాను–ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా? 13అయితే నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్పఅపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక. 14-15అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడలనేమి, నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయినయెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. 16ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను. 17యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను. 18మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను– రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా; 19నీవు మూడుదినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము 20గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి 21–నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పని వానితో చెప్పుదును–బాణములు నీకు ఈతట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. 22అయితే–బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను. 23అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.
24కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా 25మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను. 26అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడైయుండు నేమో, అతడు అపవిత్రుడైయుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు. 27అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవదినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు– నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా 28యోనాతాను–దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి 29దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు–నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా 30సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి – ఆ గడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? 31యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను. 32అంతట యోనాతాను–అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా 33సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని 34అత్యాగ్రహుడై బల్లయొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.
35ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను. 36–నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను. 37అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి–బాణము నీ అవతలనున్నదని చెప్పి 38వాని వెనుక నుండి కేకవేసి–నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెనుగాని 39సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను. 40యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి–వీటిని పట్టణమునకు తీసికొని పొమ్మనిచెప్పి వాని పంపివేసెను. 41వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. 42అంతట యోనాతాను–యెహోవా నీకును నాకునుమధ్యను నీ సంతతికిని నా సంతతికినిమధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.
Currently Selected:
1 సమూయేలు 20: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.