YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 10

10
1రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను. 2రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి. 3యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను; 4నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా 5అతడు–మీరు మూడుదినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి. 6అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి–యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా 7వారు–నీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచిమాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. 8అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న యౌవనస్థులతో ఆలోచనచేసి 9–నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా 10అతనితోకూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా–నా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును; 11నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెనుగాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెనుగాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము. 12–మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా 13రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి 14వారికి కఠినమైన ప్రత్యుత్తర మిచ్చెను; ఎట్లనగా–నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను. 15యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను. 16రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులు–దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారములకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి. 17అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను. 18రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన హదోరమును పంపగా ఇశ్రాయేలువారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను. 19ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in