YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 19

19
1యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా 2దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెను–నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును. 3అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.
4యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను. 5మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికీలాగున ఆజ్ఞాపించెను 6–మీరు యెహోవా నియమమునుబట్టియేగాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతోకూడనుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్ర త్తగా చేయుడి. 7యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు. 8మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి 9వారికీలాగున ఆజ్ఞాపించెను–యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను. 10నరహత్యనుగూర్చియు, ధర్మశాస్త్రమునుగూర్చియు, ధర్మమునుగూర్చియు, కట్టడలనుగూర్చియు, న్యాయవిధులనుగూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమ ర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లువారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు. 11మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతోకూడ ఉండును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in