2 దినవృత్తాంతములు 6
6
1అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను– గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు. 2నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి 3రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలిచియుడగా వారిని దీవించెను. 4మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను–నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. 5ఆయన సెలవిచ్చినదేమనగా–నేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై యే మనుష్యునినైనను నేను నియమింపలేదు. 6ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. 7ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను. 8అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగా–నా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదేగాని 9నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును. 10అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి 11యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి 12ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.
13తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను. 14–యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు. 15నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు. 16–నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము. 17ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. 18మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా? 19దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధినిచేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. 20నీ సేవకులు ఈ స్థలముతట్టు తిరిగిచేయు విన్నపములను వినుటకై– నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక. 21నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము. 22ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు 23నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. 24నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృిష్టి యెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల 25ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక. 26వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినయెడల 27ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక. 28దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను 29ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి 30నీవు మా పితరులకిచ్చిన దేశమందువారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులుకలిగి 31నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా. 32మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశము నుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు 33నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక. 34నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరు కొనిన యీ పట్టణముతట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినయెడల 35ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థ నను ఆలకించి వారికార్యమును నిర్వహించుదువుగాక. 36పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టిగాని సమీపమైనట్టిగాని తమ దేశములకు పట్టుకొనిపోగా 37వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని–మేము పాపముచేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని 38తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమపితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల 39నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారికార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక. 40నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. 41నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక. 42దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాఙ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
Currently Selected:
2 దినవృత్తాంతములు 6: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.