2 పేతురు 3
3
1ప్రియులారా, యీ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను 2పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సు లను రేపుచున్నాను. 3అంత్య దినములలో అపహాసకులు అపహసించుచువచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, 4–ఆయన రాకడనుగూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను. 5ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. 6ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. 7అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.
8ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. 9కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు. 10అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును. 11-12ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు,#3:11-12 మూలభాషలో–త్వరపెట్టుచు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను. 13అయినను మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టు చున్నాము; వాటియందు నీతి నివసించును.
14ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. 15మరియు మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. 16వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు.#3:16 మూలభాషలో–వక్రముగా త్రిప్పుదురు. 17ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి. 18మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినమువరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
Currently Selected:
2 పేతురు 3: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.