YouVersion Logo
Search Icon

ద్వితీయోపదేశకాండము 27

27
1మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో.. ఇట్లనిరి–నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను. 2మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి 3నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మశాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను. 4మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను. 5అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుపపనిముట్టు పడకూడదు. 6చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలులనర్పింపవలెను. 7మరియు నీవు సమాధానబలులనర్పించి అక్కడ భోజనముచేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. 8ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.
9మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి–ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి. 10నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.
11ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా –మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు 12బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను. 13రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను. 14అప్పుడు లేవీయులు
15–యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా–ఆమేన్ అనవలెను.
16–తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
17–తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
18–గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
19–పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
20–తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
21–ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
22–తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతోగాని తన తల్లికుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
23–తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
24–చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
25–నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.
26–ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in