ద్వితీయోపదేశకాండము 31
31
1మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను–నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను. 2ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. 3నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. 4యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆప్రకారముగానే యీ జనములకును చేయును. 5నేను మీకాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి 6భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు. 7మరియు మోషే యెహోషువను పిలిచి–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను. 8నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను.
9మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి 10వారితో ఇట్లనెను–ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున 11నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. 12మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. 13ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతివారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.
14మరియు యెహోవా–చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా, 15మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా 16యెహోవా మోషేతో యిట్లనెను–ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. 17కావున నాకోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమునవారు, మన దేవుడు మన మధ్యనుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు. 18వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును. 19కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము. 20నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారుతిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. 21విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతివారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునుపే, నేడే వారుచేయు ఆలోచన నేనెరుగుదును అనెను. 22కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. 23మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.
24ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత 25మోషే యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా–మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధనమందసపు ప్రక్కన ఉంచుడి. 26అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును. 27నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి. 28నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా. మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. 29ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరుచేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు. 30అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.
Currently Selected:
ద్వితీయోపదేశకాండము 31: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.