YouVersion Logo
Search Icon

ప్రసంగి 2

2
1కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; –నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను. 2నవ్వుతో– నీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతో–నీచేత కలుగునదేమియనియు నేవంటిని. 3నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని. 4నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని. 5నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని. 6వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని. 7పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని. 8నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని. 9నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. 10నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. 11అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.
12రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. 13అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని. 14జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. 15కావున–బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. 16బుద్ధిహీనులనుగూర్చినట్లుగానే జ్ఞానులనుగూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే. 17ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను–అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.
18సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని. 19వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడైయుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే. 20కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. 21ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది. 22సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? 23వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే.
24అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. 25ఆయన సెలవులేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? 26ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయుపనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in