YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 3

3
1ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. 2మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును#3:2 లేక, గృహనిర్వాహకత్వము. గూర్చి మీరు వినియున్నారు. 3ఎట్లనగా –క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చిమునుపు సంక్షేపముగా వ్రాసితిని. 4మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు. 5ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు. 6ఈ మర్మమేదనగా–అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే. 7దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. 8-11దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని#3:8-11 మూలభాషలో–అడుగుజాడలుపట్ట శక్యముకాని. క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు#3:8-11 లేక, గృహనిర్వాహకత్వము. ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. 12ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి. 13కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చినశ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై యున్నవి.
14ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని 15-18మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, 19జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. 20-21మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in