యోహాను 12
12
1కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. 2మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. 3అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. 4ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా 5–యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు#12:5 ఇది ఇంచుమించు 150 రూపాయిలు కావచ్చును. అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. 6వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. 7కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; 8బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
9కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి. 10-11అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి.
12మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని 13ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
14-15–సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు
గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు
అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. 16ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. 17ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. 18అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. 19కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు– మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి.
20ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి. 21వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి–అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. 23అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. 24గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. 25తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. 27ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; 28తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. 29కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. 30అందుకు యేసు– ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను. 31ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును; 32నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. 33తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. 34జనసమూహము–క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి. 35అందుకు యేసు–ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండ గనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. 36మీరు వెలుగు సంబంధు లగునట్లు#12:36 మూలభాషలోవెలుగుకుమారులగునట్లు. మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.
37యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
38–ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు?
ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ
బడెను?
అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను. 39-40ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా–వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి
మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు
నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసివారి హృదయము కఠినపరచెను
అని యెషయా మరియొక చోట చెప్పెను. 41యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను. 42అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములోనుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. 43వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
44అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను–నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. 45నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. 46నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. 47ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండినయెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. 48నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. 49ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. 50మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.
Currently Selected:
యోహాను 12: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.