యెహోషువ 2
2
1నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి–మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా 2దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. 3అతడు–నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా 4ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, 5వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు 6అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను. 7ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను. 8ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను. 9–యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును. 10మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. 11మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. 12నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి 13నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను. 14అందుకు ఆ మనుష్యులు ఆమెతో–నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి. 15ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను. 16ఆమె–మిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయినవారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా 17ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి–యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు 18నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారినందరిని నీయింట చేర్చుకొనుము. 19నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము. 20నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి. 21అందుకు ఆమె–మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను. 22వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరిగాని వారు కనబడలేదు. 23ఆ యిద్దరు మనుష్యులు తిరిగి కొండలనుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువయొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. 24మరియు వారు–ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.
Currently Selected:
యెహోషువ 2: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.