లేవీయకాండము 26
26
1మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. 2నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.
3మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల 4మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును, 5మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. 6ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములులేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు; 7మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు. 8మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు. 9ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. 10మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. 11నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు. 12నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు. 13మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.
14మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక 15నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను, 16నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు; 17నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు. 18ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. 19మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను. 20మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును. 21మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినయెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను. 22మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. 23శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల 24నేను కూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములనుబట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను. 25మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు. 26నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరుగాని తృప్తి పొందరు.
27నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల 28నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములనుబట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను. 29మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు. 30నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను. 31నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రా ణింపను. 32నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. 33జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. 34మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును. 35అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. 36మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధై ర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లువారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు. 37తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేక పోయెదరు. 38మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును. 39మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. 40వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు 41నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల, 42నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమును కూడ జ్ఞాపకము చేసికొందును. 43వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు. 44అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను. 45నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.
46యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.
Currently Selected:
లేవీయకాండము 26: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.