లూకా 9
9
1ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి 2దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. 3మరియు ఆయన–మీరు ప్రయాణము కొరకు చేతికఱ్ఱనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొని పోవద్దు; రెండు అంగీలు ఉంచు కొనవద్దు. 4మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి. 5మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. 6వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, (రోగులను) స్వస్థ పరచుచు గ్రామములలో సంచారము చేసిరి.
7చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు–యోహాను మృతులలోనుండి లేచెననియు, 8కొందరు–ఏలీయా కనబడెననియు; కొందరు–పూర్వ కాలపు ప్రవక్తయొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. 9అప్పుడు హేరోదు–నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను.
10అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. 11జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమునుగూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థ పరచెను. 12ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి–మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపెట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. 13ఆయన–మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు–మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. 14-15వచ్చినవారు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు. ఆయన–వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. 16అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. 17వారందరుతిని తృప్తి పొం దిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపెళ్లెత్తిరి.
18ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. –నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారి నడుగగా 19వారు– బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు– ఏలీయాయనియు, కొందరు– పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. 20అందుకాయనమీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు–నీవు దేవుని క్రీస్తువనెను. 21ఆయన –ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి 22మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని చెప్పెను. 23మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. 24తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. 25ఒకడు లోకమంతయు సంపాదించి, తన్ను తాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? 26నన్నుగూర్చియు నా మాటలనుగూర్చియు సిగ్గుపడువాడెవడో వానిగూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధదూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. 27ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాననెను.
28ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెని మిది దినములైన తరువాత, ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని, ప్రార్థనచేయుటకు ఒక కొండ యెక్కెను. 29ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. 30మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. 31వారు మహిమతో అగపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. 32పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు, ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. 33(ఆ యిద్దరు పురుషులు) ఆయనయొద్ద నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో–ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. 34అతడీలాగు మాటలాడుచుండగా మేఘ మొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. 35మరియు– ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు,#9:35 అనేక ప్రాచీన ప్రతులలో–నా ప్రియకుమారుడు అని పాఠాంతరము. ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను. 36ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి.
37మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. 38ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు. 39ఇదిగో ఒక దయ్యము#9:39 మూలభాషలో–ఒక ఆత్మ. వాని పట్టును, పెట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడిం చుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును. 40దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను. 41అందుకు యేసు –విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. 42వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను. 43గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.
44ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్య పడుచుండగా ఆయన–ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. 45అయితే వారామాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగుచేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి.
46తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా 47యేసు వారి హృదయాలోచన ఎరిగి, ఒక చిన్న బిడ్డను తీసికొని తనయొద్ద నిలువబెట్టి. 48–ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్ప వాడని వారితో చెప్పెను.
49యోహాను–ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను. 50అందుకు యేసు – మీరు వాని నాటంకపరచకుడి? మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను.
51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు 52ఆయన యెరూషలేమునకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని 53ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. 54-55శిష్యులైన యాకోబును యోహానును అది చూచి–ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు#9:54-55 అనేక ప్రాచీన ప్రతులలో–ఏలీయా చేసినట్లు–అని కూర్చబడియున్నది. మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.#9:54-55 కొన్ని ప్రాచీన ప్రతులలో–మీరు ఎట్టి ఆత్మగలవారో మీరెరుగరు మనుష్యకుమారుడు మనుష్యుల ఆత్మను రక్షించుటకేగాని నశింపజేయుటకు రాలేదనెను–అని కూర్చబడియున్నది. 56అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి. 57వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడు–నీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 58అందుకు యేసు–నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. 59ఆయన మరియొకనితో–నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను 60అందుకాయనమృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. 61మరియొకడు –ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింట నున్న వారియొద్ద సెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా 62యేసు–నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడని వానితో చెప్పెను.
Currently Selected:
లూకా 9: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.