YouVersion Logo
Search Icon

మార్కు 1

1
1దేవుని కుమారుడైన యేసు క్రీస్తు#1:1 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. సువార్త ప్రారంభము.
2–ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను; అతడు నీ మార్గము సిద్ధపరచును. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము
అని ప్రవక్తయైన యెషయాచేత వ్రాయబడినట్టు 4బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను. 5అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి. 6యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడుతలను తినువాడు. 7మరియు అతడు నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు; నేను వంగి ఆయన చెప్పులవారును విప్పుటకు పాత్రుడనుకాను; 8నేను నీళ్లలో#1:8 లేక, నీళ్లతో. మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో#1:8 లేక, పరిశుద్ధాత్మతో. మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను.
9ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహానుచేత బాప్తిస్మముపొందెను. 10వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. 11మరియు–నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
12వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. 13ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.
14యోహాను చెరపట్టబడిన తరువాత యేసు 15–కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
16ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. 17యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. 18వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. 19ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. 20వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
21అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన విశ్రాంతిదినమున సమాజమందిరములోనికి పోయి బోధించెను. 22ఆయన శాస్త్రులవలె గాక అధికారము గలవానివలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. 23ఆ సమయమున వారి సమాజమందిరములో అపవిత్రాత్మపెట్టిన మనుష్యుడొకడుండెను. 24వాడు–నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. 25-26అందుకు యేసు ఊరకుండుము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను. 27అందరును విస్మయమొంది – ఇదేమిటో? యిది క్రొత్త బోధగా ఉన్నదే; ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. 28వెంటనే ఆయననుగూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతట వ్యాపించెను.
29వెంటనే వారు సమాజమందిరములోనుండి వెళ్లి, యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రెయ అనువారి యింట ప్రవేశించిరి. 30సీమోను అత్త జ్వరముతో పడియుండగా, వెంటనే వారామెనుగూర్చి ఆయనతో చెప్పిరి. 31ఆయన ఆమెదగ్గరకు వచ్చి, చెయ్యిపెట్టి ఆమెను లేవనెత్తెను; అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను.
32సాయంకాలము ప్రొద్దు గ్రుంకినప్పుడు, జనులు సకల రోగులను దయ్యములు పెట్టినవారిని ఆయనయొద్దకు తీసి కొని వచ్చిరి; 33పట్టణమంతయు ఆ యింటివాకిట కూడి యుండెను. 34ఆయన నానావిధ రోగములచేత పీడింపబడిన అనేకులను స్వస్థపరచి, అనేకమైన దయ్యములను వెళ్లగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనియ్యలేదు.
35ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. 36సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి 37ఆయనను కనుగొని, –అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా 38ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. 39ఆయన గలిలయయందంతట వారి సమాజమందిరములలో ప్రకటించుచు, దయ్యములను వెళ్లగొట్టుచు నుండెను.
40ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా 41ఆయన కనికర పడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. 42వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. 43అప్పుడాయన–ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; 44కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. 45అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక, వెలుపల అరణ్యప్రదేశములలో నుండెను. నలుదిక్కులనుండి జనులు ఆయనయొద్దకు వచ్చుచుండిరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in