నహూము 1
1
1నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.
2యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును. 3యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి. 4ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును. 5ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు. 6ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును. 7యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును. 8ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును, 9యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును. 10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు. 11నీనెవే, యెహోవా మీద దురాలోచనచేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు. 12యెహోవా సెలవిచ్చునదేమనగా–వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లువారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను. 13వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. 14నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. 15సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.
Currently Selected:
నహూము 1: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.