YouVersion Logo
Search Icon

సామెతలు 19

19
1బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాటలాడు వానికంటె
యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు.
2ఒకడు తెలివిలేకుండుట మంచిది కాదు
తొందరపడి నడచువాడు దారి తప్పిపోవును.
3ఒకనిమూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును
అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
4ధనముగలవానికి స్నేహితులు అధికముగానుందురు,
దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును.
5కూటసాక్షి శిక్ష నొందకపోడు
అబద్ధములాడువాడు తప్పించుకొనడు.
6అనేకులు గొప్పవారి కటాక్షము వెదకుదురు
దాతకు అందరు స్నేహితులే.
7బీదవాడు తన చుట్టములందరికి అసహ్యుడు
అట్టివానికి స్నేహితులు మరి దూరస్థులగుదురు
వాడు నిరర్థకమైన మాటలు వెంటాడువాడు.
8బుద్ధి సంపాదించుకొనువాడు తన ప్రాణమునకు ఉపకారి
వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును.
9కూటసాక్షి శిక్షనొందకపోడు
అబద్ధములాడువాడు నశించును.
10భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు
రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
11ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును
తప్పులు క్షమించుట అట్టివానికి ఘనతనిచ్చును.
12రాజు కోపము సింహగర్జనవంటిది
అతని కటాక్షము గడ్డిమీద కురియు మంచు వంటిది.
13బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు
తెచ్చును
భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.
14గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము
సుబుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము.
15సోమరితనము గాఢనిద్రలో పడవేయును
సోమరివాడు పస్తు పడియుండును.
16ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు
తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు
చచ్చును.
17బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు
వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము
చేయును.
18బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము
అయితే వాడు చావవలెనని కోరవద్దు.
19మహా కోపియగువాడు దండన తప్పించుకొనడు
వాని తప్పించినను వాడు మరల కోపించుచునే
యుండును.
20నీవు ముందుకు జ్ఞానివగుటకై
ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము.
21నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా
పుట్టును
యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.
22కృప చూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును
అబద్ధికునికంటె దరిద్రుడే మేలు.
23యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ
సాధనము
అది కలిగినవాడు తృప్తుడై అపాయములేకుండ
బ్రదుకును.
24సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని
తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
25అపహాసకులు దండింపబడగా చూచి జ్ఞానము లేనివారు జ్ఞానము నొందుదురు
వివేకులను గద్దించినయెడల వారు జ్ఞానవృద్ధి నొందుదురు.
26తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు
అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.
27నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు
మీరగోరితివా?
ఉపదేశము వినుట ఇక మానుకొనుము.
28వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును
భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.
29అపహాసకులకు తీర్పులును
బుద్ధిహీనుల వీపులకు దెబ్బలును నియమింపబడినవి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in