YouVersion Logo
Search Icon

కీర్తనలు 139

139
ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.
1యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని
యున్నావు
2నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును
నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు
గ్రహించుచున్నావు.
3నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు,
నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు.
4యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే
అది నీకు పూర్తిగా తెలిసియున్నది.
5వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు
నీ చేయి నామీద ఉంచియున్నావు.
6ఇట్టి తెలివి నాకు మించినది
అది అగోచరము అది నాకందదు.
7నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును?
నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
8నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు
నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను
ఉన్నావు
9నేను వేకువ రెక్కలు కట్టుకొని
సముద్ర దిగంతములలో నివసించినను
10అక్కడను నీ చేయి నన్ను నడిపించును
నీ కుడిచేయి నన్ను పట్టుకొనును
11–అంధకారము నన్ను మరుగుచేయును
నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను
కొనినయెడల
12చీకటియైనను నీకు చీకటి కాకపోవును
రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును
చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి
13నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.
14నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును
ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి
అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు
చున్నాను
నీ కార్యములు ఆశ్చర్యకరములు.
ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.
15నేను రహస్యమందు పుట్టిననాడు
భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా
నిర్మింపబడిననాడు
నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు
16నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను
చూచెను
నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే
నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము
లాయెను#139:16 లేక ఒకటైనకాకమునుపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నియు నీ గ్రంథములో లిఖితములాయెను..
17దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి
వాటి మొత్తమెంత గొప్పది.
18వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక
కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి
నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.
19దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు
నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి.
20వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు
మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము
చేయుదురు.
21యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు
చున్నాను గదా?
నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను
గదా!
22వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను
23దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
24నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో
చూడుము
నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in