YouVersion Logo
Search Icon

కీర్తనలు 88

88
ప్రధాన గాయకునికి. మహలతు లయన్నోత్ అను రాగముమీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము. కోరహు కుమారుల కీర్తన. గీతము.
1యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా,
రాత్రివేళ నేను నీ సన్నిధిని మొఱ్ఱపెట్టునాడు
2నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక
నా మొఱ్ఱకు చెవి యొగ్గుము
3నేను ఆపదలతో నిండియున్నాను
నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది.
4సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని.
నేను త్రాణలేనివానివలె అయితిని.
5చచ్చినవారిలో విడువబడినవాడనైతిని
నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె
అయితిని
నీవిక స్మరింపనివారివలె అయితినివారు నీ చేతిలోనుండి తొలగిపోయి యున్నారు
గదా.
6అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను
అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి
యున్నావు.
7నీ ఉగ్రత నామీద బరువుగా నున్నది
నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి. (సెలా.)
8నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి
యున్నావు
నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు
వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడి
యున్నాను
9బాధచేత నా కన్ను క్షీణించుచున్నది
యెహోవా, ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టు
చున్నాను
నీవైపు నా చేతులు చాపుచున్నాను.
10మృతులకు నీవు అద్భుతములు చూపెదవా?
ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? (సెలా.)
11సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా?
నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పు
కొందురా?
12అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా?
పాతాళములో నీ నీతి తెలియనగునా?
13యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను
ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును.
14యెహోవా, నీవు నన్ను విడుచుట యేల?
నీ ముఖము నాకు చాటు చేయుట యేల?
15బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని
నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.
16నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది
నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి.
17నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి
అవి నన్ను చుట్టూర చుట్టుకొని యున్నవి
18నా ప్రియులను స్నేహితులను నీవు నాకు
దూరముగా ఉంచియున్నావు
చీకటియే నాకు బంధువర్గమాయెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in